ఎన్టీఆరే వచ్చినా తెలంగాణలో టీడీపీ బతకదు: మంత్రి తుమ్మల సంచలనం
హైదరాబాద్: ‘‘సాక్షాత్తు స్వర్గీయ నందమూరి తారకరావు వచ్చినా, తెలంగాణలో టీడీపీ బతకదు'' అంటూ తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఓ తెలుగు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారి తీశాయి.
ఏపీ రాష్ట్ర విభజనకు ముందు వరకు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణ ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం పేరిట 1985లో స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన తొలి నాళ్లలోనే అందులో చేరిన తుమ్మల ఆ పార్టీలో అగ్రనేతగా ఎదిగారు. అప్పటి వరకు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
తెలుగుదేశం పార్టీ పటిష్టతకు తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషికి గాను టీడీపీ ఆయనకు అనేక కీలక పదవులనే కట్టబెట్టింది. సుమారు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన తుమ్మల పార్టీ మారే క్రమంలో కన్నీరు కూడా పెట్టుకున్నారు.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ‘‘సాక్షాత్తు స్వర్గీయ నందమూరి తారకరావు వచ్చినా, తెలంగాణలో టీడీపీ బతకదు'' అని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications