గిరిజన బాలికల మృతి కేసులో ట్విస్ట్: అయినా వీడని చిక్కుముడులు
వరంగల్ : ఇద్దరు గిరిజన విద్యార్థినుల మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాంమోహన్, వెంకట్‌లు మృతిచెందిన బానోతు ప్రియాంక, భూమికలతో చనువుగా ఉన్నట్లు సమాచారం. దాంతో పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు.
చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్టపై గడిచిన డిసెంబర్ నెల 27న బాలికల మృతదేహాలు లభించాయి. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా, కూల్‌డ్రింక్ సీసాను పోలీసులు గుర్తించారు. బాలికల మృతి పోలీసులకు సవాల్‌గా మారింది. వారిది హత్యా? ఆత్మహత్యా అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజులుగా పలు కోణాల్లో విచారణ చేస్తున్నప్పటికీ మిస్టరీని చేధించలేకపోతున్నారు.
పురుగుల మందు డబ్బాను, కూల్ డ్రింక్‌ను మల్లంపల్లిలో కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు సంబంధిత షాపుల యాజమానులను అదుపులోకి తీసుకుని విచారించారు. యాజమానులు చెప్పిన ఆధారాల ప్రకారం కొనుగోలు చేసిన వ్యక్తులను కూడా విచారించిన పోలీసులకు పూర్తిస్థాయిలో స్ప ష్టత రాలేదని తెలిసింది.
నిరుడు నవంబర్ 23వ తేదీన హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన బాలికలు ఆ రోజు రాత్రి మల్లంపల్లి సమీపంలోని బాబాయ్ ఇంటికి వెళ్లారు. మర్నాడు ఉదయం ఆ ఇంటి నుంచి హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పిన విద్యార్థినులు మధ్యాహ్నం తర్వాత కనిపించకుండా పోయారు. సరిగ్గా 33 రోజుల తర్వాత గత నెల 27న శవాలై కనిపించారు.

దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లిన బాలికలు చాలా రోజుల తర్వాత నవంబర్ 23న తిరిగి హాస్టల్‌కు బయలుదేరారు. అప్పటికే పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ బాలికలు ఇంటి వద్దనే ఉండగా పాఠశాల నిర్వాహకులు వారి తల్లిదండ్రులను ఎందుకు సంజాయిషీ కోరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నా కూడా తల్లిదండ్రులు వారిని ఎందుకు పాఠశాలకు తీసుకు వెళ్లలేదనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఆలస్యంగా పాఠశాలకు వెళ్తున్న పిల్లల వెంట తల్లిదండ్రులు పోవాల్సి ఉంటుంది. అప్పుడే గానీ హాస్టల్, పాఠశాల నిర్వాహకులు వారిని అనుమతించే అవకాశం లేదు. ఇవన్నీ పక్కనబెడితే నేరుగా పాఠశాలకు వెళ్లాల్సిన బాలికలు అక్కడికి వెళ్లకుండా బాబాయ్ ఇంటికి ఎందుకు పోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీపావళి సెలవులకు ముందు పాఠశాలలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా? పాఠశాలలో బాలికలు ఏదైనా చేయకూడని పనిచేశారా? ఆ కారణంగానే సెలవులకు ఇంటికి వెళ్లిన బాలికలు మళ్లీ పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్లనే వారు పదే పదే రాజమ్మకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకునే ప్రయ త్నం చేసి ఉంటారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బాబాయ్ ఇంటి నుంచి హాస్టల్ వెళ్తున్నామని చెప్పిన బాలికలు మల్లంపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సు ఎక్కి నర్సంపేటకు వచ్చినట్లు తెలుస్తోంది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలోని హాస్టల్‌కు వారు ఖచ్చితంగా వెళ్లాలనుకున్నప్పుడు మార్గ మధ్యలోనే బస్సు దిగాల్సి ఉం టుంది. బస్సులో వారి వెంట ప్రయాణించిన తిరుపతి అనే వ్యక్తిని సెల్ అడిగి తీసుకున్న బాలికలు మేట్రన్ రాజమ్మకు ఫోన్ చేసి మాట్లాడారు.
తిరుపతి ఇటుకాలపల్లిలో దిగిపోగా అప్పటికీ వారు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో అతడు చెప్పాడు. ఈ మేరకు బాలికలు నర్సంపేటలో బస్సు దిగి ఉంటారనే విషయం స్పష్టమవుతోంది. నర్సంపేటలో బస్సు దిగిన వారు ఎక్కడికి వెళ్లి ఉంటారనేది తెలియడం లేదు.
బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో వారు తిరుపతి సెల్ ద్వారా రాజమ్మతో 41 సెకన్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారో ఆ సమాచారాన్ని రాజమ్మకు చెప్పి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. లేదా ఇంకేదైనా సమాచారం గురించి మాట్లాడి ఉంటారా అనే సందేహాలున్నాయి. అసలు రాజమ్మతో బాలికలు ఏం మాట్లాడి ఉంటారనేది చిక్కుముడిగా ఉంది.












Click it and Unblock the Notifications