యువతితో వివాహేతర సంబంధం: ఇద్దరు యువకుల హత్య
కేసు విషయమై రాజీ కుదుర్చుకుందామంటూ ఇంటికి పిలిచారు.. చేతులు కట్టేశారు.. కళ్లల్లో కారం చల్లారు.. ఇనుప రాడ్లతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. కేవలం అరగంట వ్యవధిలోనే తమ ప్లాన్ అమలు చేశారు.
వరంగల్: కేసు విషయమై రాజీ కుదుర్చుకుందామంటూ ఇంటికి పిలిచారు.. చేతులు కట్టేశారు.. కళ్లల్లో కారం చల్లారు.. ఇనుప రాడ్లతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. కేవలం అరగంట వ్యవధిలోనే తమ ప్లాన్ అమలు చేశారు.
నెత్తుటి ధారలతో హత్యాస్థలం భీతావహ వాతావరణాన్ని తలపించింది. ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం ఇద్దరి హత్యకు దారితీసింది. మంగపేట మండలం కమలాపురంలో జరిగిన జంట హత్యలు జిల్లాలో సంచలనం రేకెత్తించింది.
కమలాపురానికి చెందిన రౌడీ షీటర్ నర్రా శ్రీను(24), జర్పుల కల్యాణ్ (22)అలియాస్ కిట్టు స్నేహితులు. శ్రీను ఓ యువతితో వివాహేతర సంబంధ కొనసాగిస్తున్నాడు. ఇతనికి కళ్యాణ్ సహకరించేవాడు.

ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరి పైన ఇటీవల మంగపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారిద్దరిని హత్య చేయాలని అమ్మాయి మేనమామ ప్లాన్ వేశాడు.
కేసు విషయంలో రాజీ కుదుర్చుకుందామని వారిని పిలిచాడు. అమ్మాయి మేనమామకు కూడా కల్యాణ్ స్నేహితుడు. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకొని శ్రీనును తన ఇంటికి రప్పించుకోవాలని భావించాడు.
అనుకున్నట్లుగానే వారిద్దరూ శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కమలాపురంలోని ఆర్‌పీహెచ్ కాలనీలో అతని ఇంటికి వెళ్లారు. అప్పటికే ఇంట్లో కొందరు ఇనుపరాడ్లతో సిద్ధంగా ఉన్నారు.
ఇంట్లోకి రాగానే వారిని గట్టిగా పట్టుకొని చేతులు కట్టివేసి కళ్లలో కారం చల్లారు. వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లి ఇనుపరాడ్లతో తలపై కొట్టారు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే వీరు ప్రాణాలు విడిచారు. కేవలం అరగంట వ్యవధిలోనే తమ ప్రణాళిక పూర్తి చేశారు.
అక్కడ గాజులు పగిలి ఉండటంతో హత్యలో మహిళల పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
ఇళ్లపై దాడులు
కోపోద్రిక్తులైన మృతుల కుటుంబ సభ్యులు హత్య జరిగిన ఇంట్లో ఫర్నిచర్‌కు నిప్పంటించారు. పోలీసులు మంటలను ఆర్పేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. మరి కొంతమంది హత్యకు సంబంధించిన వారి ఇళ్లలోకి వెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. కొందరు వారిని శాంతింపజేసి పంపించి వేశారు.
జంట హత్యల సంఘటనతో కమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ సమయాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, హత్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు.












Click it and Unblock the Notifications