సీఎం కేసీఆర్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక భేటీ: జాతీయ పార్టీ ఏపీ బాధ్యతలిస్తారా?
హైదరాబాద్: జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకును అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నికలపై ప్రగతి భవన్‌లో కేసీఆర్ కీలక సమావేశాలు జరుపుతున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఆదివారం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో సుమారు 3 గంటలపాటు భేటీ అయ్యారు.

కేసీఆర్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక భేటీ
త్వరలోనే జాతీయ స్థాయిలో పార్టీని ప్రకటిస్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయి రాజకీయాలపై అవగాహన ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో జాతీయ పార్టీపై చర్చించేందుకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్.. ఉండవల్లికి ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా?
కొత్త పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలుంటాయి? ఏయే పార్టీలు కలిసొస్తాయి అన్న దానిపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.జాతీయ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కూడా ఉండవల్లికి కేసీఆర్ వివరించినట్లు సమాచారం. జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న సీఎం కేసీఆర్, ఏపీ బాధ్యతలను ఉండవల్లికి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

నేషనల్ పార్టీ రోడ్ మ్యాప్: ప్రశాంత్ కిషోర్‌తోనూ కేసీఆర్ కీలక భేటీ
కాగా, ఉండవల్లితో భేటీకి ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వేలపై చర్చ విస్తృతంగా చర్చలు జరిగినట్లు తెలిసింది. పార్టీ ఏర్పాటు, ఆ తర్వాత పరిణామాలు, రోడ్ మ్యాప్ తదితర కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాక, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనేదానిపైనా చర్చించినట్లు తెలిసింది. మరో రెండు రోజులపాటు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లోనే ఉండనున్న క్రమంలో కేసీఆర్ ఆయనతో పలుమార్లు భేటీ అయి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ జాతీయ పార్టీపై అంతా ఆసక్తి
మరోవైపు, కేసీఆర్ ఇప్పటికే జాతీయ పార్టీ పేరు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి బదులు భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తుపైనా ఆలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దేశ రాజధానిలో కేసీఆర్ తన జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలతో కీలక భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే వార్తలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే గాక, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications