కుమ్మక్కైనట్టు జైపాల్-డిగ్గీ అంగీకరించారు: 'తెలంగాణ'పై ఉండవల్లి ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. కేంద్ర మాజీ మంత్రులు జైపాల్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్‌లు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల పైన తన లేఖలో ఫిర్యాదు చేశారు.
రాష్ట్రాన్ని విడదీసేందుకు అందరూ కుమ్మక్కయినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలే అంగీకరించారని ఆయన అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని వరంగల్ ఎన్నికల ప్రచారంలో జైపాల్ రెడ్డి ప్రస్తావించారని, దిగ్విజయ్ సింగ్ సమర్థించారని ఫిర్యాదు చేశారు.

చట్ట వ్యతిరేకంగా జరిగిన పనుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే వరంగల్ ఉప ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీతో గెలిపొందారు. ఆయన గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ తదితరులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణను తమ పార్టీయే ఇచ్చిందని చెప్పారు. అంతేకాదు, ఎన్నో కష్టాలకు ఓర్చి తాము తెలంగాణ ఇచ్చామని చెప్పారు. దీంతో ఇప్పుడు ఉండవల్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications