Union Budget 2022: గోల్ మాల్ బడ్జెట్ - వ్యవసాయ రంగానికి బిగ్ జీరో : సీఎం కేసీఆర్ ఆగ్రహం..!!
కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022- 23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల పైన ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై స్పందించారు. ఈ బడ్జెట్ దశ దిశా నిర్దేశం లేని, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ గా అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం తో నిండి, మాటలగారడీ తో కూడి వున్నదని అని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను సిఎం పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఇలానా
వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సిఎం అన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని విమర్శించారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సిఎం పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు.

కేంద్రం నిర్లక్ష్యంగా
దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సిఎం ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజోరోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు.
Recommended Video

కేంద్రానిక సోయి లేదు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే.. ఇక్కడ మాత్రం కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని సిఎం వ్యాఖ్యానించారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సిఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీని పైన ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. బడ్జెట్ పైన తన అభిప్రాయాన్ని కేసీఆర్ మరింత స్పష్టంగా వివరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications