బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కిం కర్తవ్యం ఇదే!!
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక మంత్రి జీ. కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేడు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చూగ్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, శాసన సభ్యులు, పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన నేడు తెలంగాణ బిజెపి రథసారథిగా పగ్గాలు చేపట్టారు.
నాలుగోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు, భాగ్యలక్ష్మి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతిబా పూలే, శాసనసభ వద్ద ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.

శాసన సభ ఎదురుగా గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకున్నారు. శాసనసభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు , మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటు వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, పలువురు సీనియర్ నాయకులు ఆయనతో పాటు గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరులకు నివాళులర్పించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల విషయంలో ఇప్పటి నుండే తీవ్రంగా కష్టపడాల్సి ఉంది. బీజేపీలో నేతలను అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావటం, బీజేపీలో అంతర్గత విబేధాలకు చెక్ పెట్టటంతో పాటు, అధికార బీఆర్ఎస్ పై బలమైన నిరసన గళాన్ని వినిపించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాల్సిన అవసరం ఉంది.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్రమంత్రి వర్యులు శ్రీ @kishanreddybjp గారు బాధ్యతలు స్వీకరణ pic.twitter.com/v3CEJ6DBpp
— BJP Telangana (@BJP4Telangana) July 21, 2023
అంతేకాదు బీజేపీని పక్కకు నెట్టి దూసుకుపోతున్న కాంగ్రెస్ కు సైతం చెక్ పెట్టి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అని చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీలో రానున్న ఎన్నికల నేపధ్యంలో చేరికలపై మరింత ఫోకస్ పెట్టి ఇప్పటి నుండే అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చెయ్యాల్సిన అవసరం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఎన్నికల సమయంలో బాధ్యత స్వీకరించటం ఆయన సామర్ధ్యానికి పరీక్ష. నిజంగా ఇది ఆయనకు కత్తిమీద సామే.












Click it and Unblock the Notifications