అమరావతి శంకుస్థాపన: రఘువీరాతో విభేదిస్తున్న ఉత్తమ్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెసు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి శంకుస్థాపనకు వెళ్తే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌పై ఆధారపడాలని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అభిప్రాయపడుతున్నారు.
అమరావతి శంకుస్థాపనకు వెళ్లే విషయంపై ఇరు రాష్ట్రాల కాంగ్రెసు పార్టీల మధ్య తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెసు నేతలకు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రులు అమరావతి శంకుస్థాపన పత్రాలను అందించారు. దీంతో అమరావతి శంకుస్థాపనకు వెళ్తే ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి పాదులు పడుతాయని తెలంగాణ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపనకు వెళ్లే విషయంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి రఘువీరా రెడ్డిని ఆరా తీశారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్తున్నారా అని ఆయన రఘువీరా రెడ్డిని అడిగారు. అయితే, మోడీ అపాయింట్‌మెంట్ ఇస్తే వెళ్తామని, లేదంటే దూరంగా ఉంటామని రఘువీరా రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ అడిగినట్లు తెలుస్తోంది.

అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కలవడానికి తమకు అవకాశం ఇవ్వాలని వారు ప్రధానిని కోరారు. అయితే, ఇప్పటి వరకు ఆ విషయం ఏదీ తేలలేదు. ప్రధాని ప్రతిస్పందన కోసం ఈ నెల 20వ తేదీ వరకు వేచి చూడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆ తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించాలని ఆలోచిస్తోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం అమరావతి శంకుస్థాపనకు దూరంగా ఉంటే, తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా హాజరు కాకపోచ్చునని అంటున్నారు. రెండు రాష్ట్రాల పార్టీలు భిన్న వైఖరులతో వ్యవహరిస్తే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఎపి పిసిసి నిర్ణయంపైనే తెలంగాణ కాంగ్రెసు నాయకులు అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యే విషయం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications