'చంపేస్తామని ప్రజాప్రతినిధులకు ఫోన్లో టిఆర్ఎస్ బెదిరింపు'
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కొనేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, లొంగని ప్రజాప్రతినిధులను చంపుతామని ఫోన్లో బెదిరిస్తున్నారని, టిఆర్ఎస్ బెదిరింపులకు లొంగేది లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు.
ప్రజాప్రతినిధులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, దీనిన ప్రజలు గమనిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ సాకారం చేశారన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలిస్తోందన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 536 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని, కేవలం 137 మంది ప్రజాప్రతినిధులే ఉన్న టిఆర్ఎస్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ తప్ప మిగతా ఏడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. కెసిఆర్ ఎన్నికల సమయంలో ఎన్నో మాయమాటలు చెప్పారన్నారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అని చెప్పారని, వేటినీ నెరవేర్చలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నల్గొండ జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. సింగిల్ బెడ్ రూం ఇళ్లకు నిధులు ఇవ్వని కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. శాసన సభా పక్ష నేత జానా రెడ్డి మాట్లాడుతూ... పార్టీ ఓటర్లు, అభ్యర్థులు ప్రజల మధ్యే ఉంటారని, తమ ఓటర్లను ప్రజలే రక్షించుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications