బీజేపీలో వారసులు లేరా? మోడీవి చిల్లర రాజకీయాలు: మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోటపై జెండా ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో అవినీతి, బంధుప్రీతి రెండు పెను సవాళ్ళుగా మారాయని, వాటిపైనే తాను పోరాటం చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇదే సమయంలో వారసత్వ రాజకీయాలపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశంలో కుటుంబ పాలన పై ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు చేశారు.

మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇక ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారసత్వ రాజకీయాలపై మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలు చేస్తున్న నాయకులు లేరా అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబం మీద ఈ రోజు ఏం మాట్లాడినా తప్పేనని, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాని మోడీ చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలి
ప్రధాని మోడీ ప్రధాని కుర్చీ స్థాయి తగ్గిస్తున్నారు అంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా అంటూ ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీలోనూ రాజకీయ వారసులు ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

మునుగోడులో విజయం కాంగ్రెస్ పార్టీదే
ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో అందరూ కలిసి మెలిసి పనిచేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెట్టిన డిమాండ్లు తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఇక పార్టీలో చోటు చేసుకున్న అన్ని వ్యవహారాలు సర్దుకుంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications