వేలకోట్ల మోసాలు: సుజనా, లగడపాటిని వదలొద్దని కేంద్రానికి వీహెచ్ లేఖ
న్యూఢిల్లీ: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలుగుదేశం పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరిలపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభసభ్యుడు వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బ్యాంకుల్లో వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేస్తున్న బడా వ్యాపారవేత్తలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రిని కోరిన ఆయన.. వీరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు.
బుధవారం ఆర్థికమంత్రి జైట్లీకి రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొన్నారు. ఓ రైతుతో తన సంభాషణ ఆధారంగా లేఖ రాసిన వీహెచ్.. కేంద్రమంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వంటివారి ఆర్థిక మోసాలను అందులో ప్రస్తావించారు.

రైతులకు కూడా అన్ని విషయాలు తెలుసునని పేర్కొన్నారు. బడా మోసాలు చేస్తున్న వారిని పట్టించుకోకుండా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని వీహెచ్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి రూ. 320కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారని ఆరోపించారు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా అనేక ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని వీహెచ్ తన లేఖలో పేర్కొన్నారు. ల్యాంకో హిల్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో 7200కోట్ల అక్రమాలు, ల్యాంకో కొండపల్లి పవర్ కంపెనీలో 1000కోట్లు, బాసర ట్రిపుల్ ఐటి, టిటిడి వేదపాఠశాలలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ తన లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications