మనకు వందే భారత్ స్లీపర్- రూట్ ఇదే?
Vande Bharat Express: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రయాణికుల నుంచి లభిస్తోన్న అపూర్వ ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌లో కీలక మార్పులను తీసుకుని రానుంది. వారికి మరింత అనుకూలంగా తీర్చిదిద్దుతోంది. కొత్తగా స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి వందే భారత్ స్లీపర్‌లో. ఇందులో 613 బెర్తులతో 11 ఏసీ 3-టయర్ కోచ్‌లు, 188 బెర్తులతో నాలుగు ఏసీ 2- టయర్ కోచ్‌లు, 24 బెర్తులతో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. జీఎఫ్ఆర్‌పీ ప్యానెళ్లు, ఆటోమేటిక్ ఎక్స్‌టీరియర్ పాసింజర్ డోర్లు, సెన్సర్ ఆధారంగా పని చేసే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, అత్యాధునిక సదుపాయాలను కలిగివుండటం ఈ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత.
ప్రతి బెర్త్‌కూ యూఎస్‌బీ ఛార్జింగ్ పిన్, రీడింగ్ బల్బ్, దివ్యాంగులకు ప్రత్యేక బెర్తులు- టాయ్‌లెట్లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, ఇన్‌సైడ్ డిస్‌ప్లే ప్యానెల్స్, సెక్యూరిటీ కెమెరాలు, ఫస్ట్ క్లాస్ ఏసీలో హాట్ వాటర్ సౌకర్యం అందుబాటులో ఉంటాయి.
కాగా కాచిగూడ లేదా నాంపల్లి నుంచి మైసూరుకు వందే భారత్ స్లీపర్‌ను ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదనలు రైల్వే అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత రద్దీ మార్గం కావడం, ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ఈ రెండు నగరాల మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ నడిపించాలనే ప్రతిపాదనలను రూపొందిస్తోన్నట్లు చెబుతున్నారు. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలను కూడా సేకరిస్తోన్నారని అంటున్నారు.
ఇప్పటికే కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తెల్లవారు జామున 5:45 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 20703 వందే భారత్ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 20704 ఎక్స్‌ప్రెస్ రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కొత్తగా నడిపించదలిచిన వందే భారత్ స్లీపర్‌ను మైసూరు వరకూ నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి అనుగుణంగా కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూరు వరకు కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రూట్‌ను ఖరారు చేయవచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications