అవినీతి ఎమ్మెల్యేలకు కేసీఆర్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చారుగా: తూర్పారబట్టిన విజయశాంతి
బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన అంశాలపై ఆమె కెసిఆర్ ను ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కెసిఆర్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారు అని, అవినీతికి పాల్పడుతున్నారని, కొందరు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల నుండి 3 లక్షల వరకు వసూలు చేశారని, అలా వసూలు చేసిన ఎమ్మెల్యే లకు సంబంధించిన చిట్టా తన దగ్గర ఉందని కెసిఆర్ చెప్పారని పేర్కొన్నారు. ఇది మళ్లీ రిపీట్ అయితే వారికి టికెట్లు దక్కవని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యేలను కెసిఆర్ హెచ్చరించారు.

ఇక ఈ నేపథ్యంలో తప్పు చేసిన ఎమ్మెల్యేలకు శిక్ష లేదు సరికదా? కెసిఆర్ తీరు వారిని మరింత ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్ళు మారితే జనాన్ని దోచుకోవడానికి అవకాశం ఇస్తానని అద్భుతమైన ఆఫర్ కేసీఆర్ ఇవ్వడాన్ని ఏమనుకోవాలి అని విజయశాంతి ప్రశ్నించారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల వివరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పిన కెసిఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
అంతా కేసీఆర్ కు తెలిసే జరుగుతుందని విజయశాంతి ఆరోపించారు. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నట్టే కదా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన, అవినీతిమయమైన పార్టీకి జాతీయస్థాయిలో అవకాశం ఇస్తే దేశాన్ని దోచుకున్నారని, జాతీయ స్థాయిలో అధికారం కోసం వాళ్లు చేసిన ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచెయ్యకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆ విజ్ఞత తెలంగాణ ప్రజలకు ఉందని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో కెసిఆర్ కుటుంబ సభ్యుల పైన మండిపడిన విజయశాంతి ఎన్ని పదవులు అయిన తీసుకుంటాం, లక్షల కోట్ల తెలంగాణ ప్రజల జనం కొల్లగొడతాం అన్న చందంగా కేసీఆర్ కుటుంబం తీరు ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష తిన్నా.. వాళ్ల టిక్కెట్లు ఎగర గొడతామని చెప్తున్నారన్నారు.
తెలంగాణ దోపిడి మాకు, మా అత్యంత సొంత వర్గానికి మాత్రమే హక్కు అని అర్థం వచ్చేలా సీఎం ప్రకటన ఉందని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా బిఆర్ఎస్ తమ ప్రభుత్వ అవినీతిని తామే స్వయంగా ఒప్పుకుందని, కెసిఆర్ ప్రకటనతో ప్రతిపక్షాలకు ఎన్నో విలువైన ఆధారాలు వచ్చాయని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications