కేంద్రంతో ఒప్పందాలు, ఇప్పుడేమో డ్రామాలు, ధర్నాలా?: కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని దుయ్యబట్టారు. తాజా పరిస్థితిని గమనిస్తే.. కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్(ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి... వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది. అందుకే 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది.

కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం.. ఇప్పుడు నాటకాలు: విజయశాంతి ఫైర్
మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి బియ్యం) రూపంలో మాత్రమే ఇవ్వాలని... అలాగే ఉప్పుడు బియ్యాన్ని పరిమితంగా తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, యాసంగి ధాన్యం కేవలం బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయనేది అశాస్త్రీయమైన అంశమని,పైగా, ఇది రైస్ మిల్లర్లకు సంబంధించిన వ్యవహారమని... ఇందులో రైతుకు ఏమాత్రం సంబంధం లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని విజయశాంతి తెలిపారు.
కానీ, సెప్టెంబరు 26న ఢిల్లీ టూర్ వెళ్లిన సీఎం కేసీఆర్... గత యాసంగిలో 92.34 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, దీని నుంచి 62.52 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అయ్యాయని.. ఉత్పత్తిలో కనీసం 90 శాతం బాయిల్డ్ రైస్ తీసుకోవాలని, రానున్న రోజుల్లో ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ అసలు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి.. పాత కోటాకు (24.75 లక్షల టన్నులు) మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను అదనంగా ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తామని స్పష్టంగా ఒప్పందం చేసుకుని... కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎఫ్‌సీఐకి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తామని... ఇక మీదట ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని హామీ ఇచ్చారని తెలిపారు.

కేసీఆర్‌ను గద్దె దించాలంటూ విజయశాంతి పులు
కేంద్రం కూడా ఈసారికి తప్ప... మరోసారి ఒక్క కూడా గింజ బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కరాఖండిగా చెప్పి ఈ మేరకు లేఖాస్త్రాలన్నీ సెప్టెంబరు నెలాఖరుతోనే పూర్తి చేసింది. అయితే... కేంద్రం వద్ద ఒప్పుకుని, లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చిన అంశాన్ని సీఎం కేసీఆర్ ఇంతకాలం అధికారికంగా వెల్లడించకుండా... కేంద్రం అసలు బాయిల్డ్ రైస్ కొనబోమని అంటోందని, వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని, రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దనే ప్రచారాన్ని మొదలుపెట్టి... హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో మతి భ్రమించి, మిల్లర్లతో కుమ్మకై... నేడు ధర్నా పేరుతో రాద్ధాంతాన్ని సృష్టిస్తూ... రైతులను ఆందోళనలో పడేస్తూ... కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటు.
ఇప్పటికైనా తెలంగాణ సమాజం రాష్ట్ర సర్కార్ కపటనాటకాలను గమనించి రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దించాలి అని ప్రజలకు విజయశాంతి పిలుపునిచ్చారు.
Recommended Video

చేతగానితనం, అందుకే కేసీఆర్ డ్రామాలంటూ మల్లు రవి ఫైర్
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లు రవి సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. రైతులు పండించిన పంటను ప్రతీసారి రాష్ర్ట ప్రభు త్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు రైస్ మిల్లర్లకు సరఫరా చేసి ఎఫ్‌సీఐకి లేవీ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్‌మెంట్ ద్వారా డబ్బులు తీసుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనం వల్ల రాజకీయ లబ్ధికోసం ధర్నాలు చేయటం సరైన పద్ధతి కాదన్నారు. వరి పంట కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారని మండిపడ్డారు. గతంలో శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వరి పంట విష యంలో రైతులను భయపడొద్దని, మొన్న మీడియా సమావేశంలో వరి వేయద్దని చెప్పడం కేసీఆర్ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. తక్షణమే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రంలో రైతులను పట్టించుకోవాలన్నారు.
పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసే విధంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మల్లు రవి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసింది టీఆర్‌ఎస్ పార్టీకి.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభు త్వం ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని వరిపంట కొనాలని ధర్నా చేయడం హస్యస్పందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications