బండి సంజయ్ కుమారుడు భగీరథ్ విషయంలో కేసీఆర్, గులాబీనేతలు చేస్తుందేమిటి? విజయశాంతి ప్రశ్న!!
బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో బండి భగీరధ్ వీడియోలు వైరల్ చేస్తూ ట్రోల్ చెయ్యటంపై మండిపడ్డారు. గతంలో సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుపై ట్రోల్స్ వచ్చినప్పుడు రాజకీయంగా పోరాడలేక కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని గులాబీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని గుర్తు చేసిన విజయశాంతి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు తన తోటి విద్యార్థులను కొట్టి ర్యాగింగ్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్న విషయంలో తనదైన శైలిలో స్పందించారు.

గులాబీ నేతలు అప్పుడు నానా గాయీ గత్తర చేశారు : విజయశాంతి
కొన్నాళ్ల కిందట సీఎం కేసీఆర్ గారి మనవడిపై సోషల్ మీడియాలో నెగెటివ్ వీడియోలు, ట్రోలింగ్స్ వచ్చినప్పుడు ఏమైందో అందరికీ తెలుసు అని పేర్కొన్న విజయశాంతి రాజకీయంగా పోరాడలేక తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారని గులాబీ నేతలు నానా గాయీ గత్తర చేశారన్నారు . మరిప్పుడు మా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ విషయంలో కేసీఆర్ గారు, ఆయన గులాబీ దళం చేసిందేమిటి? చేస్తోందేమిటి? అంటూ ఆమె ప్రశ్నించారు.

విద్యార్థి భవిష్యత్తు అని చూడకుండా కేసులు పెట్టించి వేధిస్తున్నారు
స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల మధ్య చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకుంటాయి, వాళ్లే సర్దుకుంటారు, కలసిపోతారు. భగీరథ్ విషయంలో కూడా అదే జరిగింది. అవతలి విద్యార్థి కూడా అక్కడేం జరిగిందన్న వివరణ ఇచ్చి తామంతా కలసిపోయామని స్పష్టంగా చెప్పాడు. ఇలాంటి విషయాలపై బీఆరెస్ నేతలకు ఆ మాత్రం అవగాహన ఉండదని మేం అనుకోం అంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, విద్యార్థి భవిష్యత్తు అని చూడకుండా కేసులు పెట్టించి వేధించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధపడటం సిగ్గు చేటు అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

అందరినీ నానా విధాలుగా వేధిస్తున్న కేసీఆర్ పైనే ముందుగా కేసులు పెట్టాలి
ఆ మాటకొస్తే అసలు తెలంగాణలో సర్కారీ బడులతో మొదలుపెట్టి దేశానికి ఇంజనీర్లని అందించే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వరకూ అందరీకీ సమస్యలే ఉన్నాయని పేర్కొన్న విజయశాంతి, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టాలో చెప్పాలన్నారు. పోషకాహారం లేక, టాయ్‌లెట్లు లేక విద్యార్థులు, సక్రమంగా జీతాల చెల్లింపులు జరగని అధ్యాపకులు... ఇలా అందరినీ నానా విధాలుగా వేధిస్తున్న కేసీఆర్ పైనే ముందుగా కేసులు పెట్టాలి అంటే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఇంతగా అధోగతి పాలు చేసిన ఈ పెద్దమనిషి ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ దేశాన్ని ఉద్ధరిస్తాననడం వింతల్లోకెల్లా వింత అంటూ విజయశాంతి తనదైన శైలిలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications