రాహుల్ గాంధీ పాదయాత్రతో జనసంద్రంగా వరంగల్; కాంగ్రెస్ లో జోష్; రాహుల్ ఏమన్నారంటే!!
తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపి రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ పాదయాత్రలో, కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. వరంగల్ చౌరస్తా నుంచి రుద్రమదేవి కూడలి వరకు రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. రుద్రమదేవి కూడలి జనసంద్రంగా మారింది.
రాహుల్ గాంధీ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రుద్రమదేవి కూడలిలో రాహుల్ ప్రసంగిస్తూ బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచిందని ధ్వజమెత్తారు. ''భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి మొదలుకొని కశ్మీర్ వరకు పాదయాత్ర చేశానన్నారు . ఆ సమయంలో ఆరెస్సెస్, బీజేపీ ప్రజలను ఏ విధంగా విభజిస్తున్నాయో అర్థమైందని పేర్కొన్నారు . ఇది విద్వేషాలు రగిలించే దేశం కాదు ప్రేమను పంచే దేశం అని చెప్పదల్చుకున్నానన్నారు.

కేసీఆర్ తన కుటుంబసభ్యులకు మాత్రమే మేలు చేస్తారు. ప్రధాని మోదీ ధనికులైన తన స్నేహితులకు మాత్రమే మేలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి మేలు చేస్తుంది. తెలంగాణలో ఇకపై బీజేపీ కనిపించదు'' అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన జరిపిస్తామని, బీసీల రిజర్వేషన్ పెంచుతామన్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నేరవేరుస్తామన్నారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణనను జరిపిస్తామన్నారు. స్థానిక సంస్థల్లోనూ బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్‌గాంధీ వెల్లడించారు. ''బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటే. ఎక్కడ కాంగ్రెస్, బీజేపీ పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి ఎంఐఎం ఉంటుందని ఆయన ఆరోపించారు. ఇక్కడ కేసీఆర్, కేంద్రంలో మోదీని అధికారంలో నుంచి దించేస్తాం'' అని అన్నారు.

అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.500లకే ఇవ్వబోతున్నామని, మహిళల అకౌంట్లో ప్రతి నెల రూ.2,500లు వేస్తామని అన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు ఎకరానికి రూ.12 వేలు చెల్లిస్తామని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో పెట్టామని, ప్రజలు కాంగ్రెస్ ను ఆడారించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications