ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు తెలుగు యువకుల మృతి, కోమాలో దంపతులు
'సిడ్నీ/హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్నారు. సోమవారం జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌కుమార్ సామల, భీమవరానికి చెందిన శేషగిరి మేడవరపు అనే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. అదే కారులో ఉన్న హన్మకొండకు చెందిన దంపతులు నిశాంత్, ప్రియదర్శినిలకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం వీరు స్థానిక ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హన్మకొండలో ఉన్న ప్రియదర్శిని తల్లిదండ్రులకు సమాచారం అందింది. వారు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిసింది. ఆస్పత్రిలో వారి బాగోగులు చూసుకోవడానికి మనుషులు లేని పరిస్థితి ఉందని, తాము వెళ్లాలంటే వీసా లేదని ప్రియదర్శిని తల్లిదండ్రులు కమలాకర్, కవితలు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. తమకు ప్రభుత్వం సాయం అందించాలని వేడుకుంటున్నారు.

చనిపోయినవారికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ దేశంలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తున్నారని వారు వివరించారు. ప్రియదర్శిని దంపతుల్ని కాపాడుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఎవరిని సంప్రదించాలో, ఎలా సంప్రదించాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందిస్తే తమవారి దగ్గరికి వెళ్లి వారిని కాపాడుకోగలమని అంటున్నారు. హన్మకొండలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన ప్రియదర్శిని ఉన్నత చదువుల కోసం భర్తతో కలిసి ఈ మధ్యే పెర్త్ వెళ్లారు. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications