బాబుని వదలం: కేటీఆర్, మోడీ మాట్లాడరేం: వీహెచ్, కేసీఆర్‌పై కృష్ణ
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో విచారణకు ఇంకా సమయం ఇస్తే మరింత సమాచారాన్ని సేకరిస్తామని ఏసీబీ పీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో ఏసీబీ సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. ఏసీబీ కేసులో పోలీసుల సహకారం తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.
ఇప్పటికే అతి తక్కువ సమయంలో ఎంతో సమాచారాన్ని సేకరించామని చెప్పారు. విచారణకు సమయమిస్తే మరింత సేకరిస్తామన్నారు. బెయిల్ ఇస్తే నిందితులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశముందన్నారు.
చంద్రబాబు సూత్రధారి: వీహెచ్
ఓటుకు నోటు కేసులో సూత్రధారి చంద్రబాబేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు పేర్కొన్నారు. చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలన్నారు. బాబు ఫోన్‌ను ట్యాప్ చేయలేదని, ఎమ్మెల్యే స్టీఫెన్ ఫిర్యాదు మేరకు ఫోన్ సంభాషణలను ఏసీబీ రికార్డు చేసిందన్నారు.
ఆ రికార్డుల్లో చంద్రబాబు మాట్లాడిన సంభాషణ రికార్డు అయిందన్నారు. చంద్రబాబు స్టీఫెన్‌తో మాట్లాడలేదని ఎందుకు చెప్పడం లేదన్నారు. రేవంత్ రెడ్డిని తాను పంపలేదని బాబు ఎందుకు చెప్పడం లేదన్నారు. ఏపీ పోలీస్ బెటాలియన్‌ను దించి ఏం చేద్దామనుకుంటున్నావని బాబును ప్రశ్నించారు.
ముఖ్యమంత్రికైనా చట్టం వర్తిస్తుందన్నారు. ఏడాది నుంచి తెలంగాణలో ఆంధ్రా ప్రజానీకానికి ఇబ్బందులు ఎదురయ్యాయా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఏఏపీ మంత్రి తప్పు చేశారని జైలుకు పంపిన కేంద్రం చంద్రబాబు వ్యవహారంలో ఎందుకు ఉపేక్షిస్తుందన్నారు.
చంద్రబాబుపై మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దేశం బయట నుంచి బ్లాక్ మనీని రప్పిస్తానన్న ప్రధాని మోడీ దేశం లోపలనే బ్లాక్‌మనీ పట్టుబడితే ఎందుకు స్పందించడం లేదన్నారు. కొన్ని టీవీ చానెళ్లు తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నాయన్నారు.
చంద్రబాబు చేసిన తప్పును చిన్నదిగా చూపి ఫోన్ ట్యాపింగ్ చేశారని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చంద్రబాబుకు బ్లాక్ మనీ ఎలా వచ్చందో చెప్పాలన్నారు.

బాబును వదలం: కేటీఆర్
ఓటుకు నోటు వ్యవహారంలో అన్ని ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబును వదిలే ప్రసక్తి లేదని కేటీఆర్ అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్న బాబు ఈ వ్యవహారంలో తన పాత్రను ఒప్పుకున్నట్లే అన్నారు. చంద్రబాబు ఏపీ సీఎం అయినా, తెలంగాణకు సాధారణ పౌరుడే అన్నారు.
చంద్రబాబు తీరును జేపీ కూడా ఎండగట్టారన్నారు. బాబు ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకున్న చట్టం మాత్రం అందరికి సమానమే అన్నారు. బాస్ చెబితేనే చేశానని రేవంత్ చెప్పారన్నారు. రేవంత్ రెడ్డిని టీడీపీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పాలన్నారు. హైదరాబాదులో పోలీసులను మార్చిన బాబు నీళ్లు, పాలు, విద్యుత్, కూరగాయలు ఏపీ నుండి తెచ్చుకుంటారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ పైన జీవన్ రెడ్డి, మందకృష్ణ మాదిగ
ఓటుకు నోటు వ్యవహారంలో తెరాస ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వాల అధినేతల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, చంద్రబాబులు తోడుదొంగలన్నారు. అసలు ఇతర పార్టీల నుంచి తెరాసలో 13 మంది ఎమ్మెల్యేలు ఎలా చేరారో చెప్పాలని నిలదీశారు. దీనిని గవర్నర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల నుండి తెరాసలోకి ఎమ్మెల్యేల చేరికపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రలోభాలు లేకుండానే అంతమంది ఎలా చేరారన్నారు.
కేసీఆర్ కాల్ డేటా, ఎమ్మెల్యేలతో జరిపిన మంతనాలు బయటపెట్టాలన్నారు. వీటన్నింటికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్, చంద్రబాబులు ఇద్దరు నిందితులే అన్నారు. దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వాల చేతిలో ఏసీబీ కీలుబొమ్మగా మారిందన్నారు.
మీకు ఏసీబీ ఉంటే మాకూ ఏసీబీ ఉందని కేసీఆర్, చంద్రబాబులు సవాల్ విసురుతున్నారని, సీబీఐ పట్ల కూడా ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. 2011 నుండి ఇప్పటి వరకు జరిగిన ఓటుకు నోటు వ్యవహారాలపై సుప్రీం కోర్టుచే విచారణ జరిపించాలన్నారు. కిరణ్, కేసీఆర్, చంద్రబాబుల బండారం బయటపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications