వెదర్ అలర్ట్: ఐదు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
జులై 9 అంటే ఆదివారం నుంచి జులై 13వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జులై 12, 13వ తేదీల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆదివారం హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
జులై 8వ తేదీ శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ముత్తారంలో63.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెద్దపల్లి పరిధిలోని శ్రీరాంపూర్‌లో 58.8 మి.మీ, ముల్లు జిల్లా పరిధిలోని గోవిందరాజుపేటలో 50 మి.మీ, కొమురంభీం అసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్‌లో 48 మి.మీ, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 45.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉన్నాయి.
మరోవైపు, ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ భారీ వర్షంలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications