హిజబ్ తీర్పుపై అసెంబ్లీలో స్పందించిన కేసీఆర్: మతాచారాలను నిషేధించేలా: ఒవైసీ
హైదరాబాద్: కర్ణాటకలో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హిజబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు తుది తీర్పు వెలువడించింది. హిజబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలు, విద్యాసంస్థలు, పాఠశాలలకు హాజరు కావడాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. హిజబ్‌ను ధరించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.

స్వాగతించిన కేంద్రమంత్రులు..
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ లోక్‌సభ సభ్యుడు, యువజన మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్.. ఈ తీర్పును స్వాగతించారు. విద్యార్థులకు మతపరమైన అంశాల కంటే చదువు అత్యవసరమని, విద్యాసంస్థల్లో అడుగు పెట్టే ప్రతి విద్యార్థీ సమానమేననే విషయాన్ని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టం చేసినట్టయిందని అన్నారు.

మహిళా స్వేచ్ఛను హరించినట్టు..
ఈ తీర్పు పట్ల జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నాయకులు అధినేత ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ స్పందించారు. తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. మత స్వేచ్ఛను అడ్డుకున్నట్టయిందని వ్యాఖ్యానించారు. హిజబ్ అనేది ముస్లిం మహిళలు ధరించే ఓ సాధారణ దుస్తుల్లా చూడకూడదని పేర్కొన్నారు. ఓ మహిళ తాను ఏ రకమైన వస్త్రాలను ధరించాలనే విషయంపై ఉన్న స్వేచ్ఛను హరించినట్టయిందని అన్నారు.

ఎవరు ఏం ధరిస్తే..ఏంటీ?
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. హిజబ్ తీర్పుపై స్పందించారు. ఈ అంశంపై నిండు అసెంబ్లీలో మాట్లాడారు. ఎవరు ఏం ధరిస్తే ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని అన్నారు. హిజాబ్ వివాదాన్ని ఎందుకు తెర మీదికి తీసుకొచ్చారని ప్రశ్నించారు. శాంతియుత వాతావరణాన్ని ఎందుకు వేడెక్కిస్తోన్నారని నిలదీశారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవడానికి బదులుగా కొత్తవాటిని తెర మీదికి తీసుకుని రావడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.
Recommended Video

మత ఆచారాలను నిషేధించేలా..
హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. హైకోర్టు తీర్పు పట్ల నిరాశను వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు.. మత స్వేచ్ఛ, సంస్కతి-సంప్రదాయాలను హరించినట్టయిందని వ్యాఖ్యానించారు. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. మతాచారాలను నిషేధించేలా ఉందని చెప్పారు. అల్లా ఆదేశాలను పాటించడమా? లేక హైకోర్టు ఉత్తర్వులను అనుసరించడమా? అనేది ఎంపిక చేసుకునే పరిస్థితిని పిల్లలకు కల్పించినట్టయిందని అన్నారు.












Click it and Unblock the Notifications