నాగాచైతన్య-శోభితకు లేని సమస్య మీకెందుకు?: వేణుస్వామికి నోటీసులపై హైకోర్టు సీరియస్
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలంగాణ మహిళా కమిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీనటులు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల విడాకులపై జ్యోతిష్యం చెప్పినందుకు జ్యోతిష్కుడు వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వేణుస్వామి వివరణ కోరుతూ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది.
ఈ నేపథ్యంలో నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, మహిళా కమిషన్ పై మండిపడింది.

కాగా, ఇటీవల నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆరోజే వేణుస్వామి వారి జోస్యం చెబుతూ.. మూడేళ్లలోనే వీరిద్దరూ విడిపోతారన్నారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి తెరలేపారు. వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనిపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదుతో మహిళా కమిషన్.. వేణుస్వామికి నోటీసులచ్చింది. దీంతో వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తాజాగా మహిళా కమిషన్ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, గతంలో కూడా వేణుస్వామి సినిమా రిలీజ్ ల గురించి, రాజకీయ ఫలితాల గురించి జోష్యం చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనపై ఆయా వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాను ఇకపై ఎవరి జోస్యం చెప్పనని వేణుస్వామి ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కూడా ఆయన పలువురి జోస్యాలు చెప్పారు.












Click it and Unblock the Notifications