డిసెంబర్లో నా కూతురు పెళ్లి, ఇక తర్వాత కెసిఆర్‌ది: రేవంత్ ఆగ్రహం, ఎర్రబెల్లికి చేదు
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రుల పైన గురువారం నాడు నిప్పులు చెరిగారు. నిజామాబాద్‌లో చేపట్టిన రైతుయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు.
రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అనారోగ్యంతో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని అనడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 1,600 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పట్టించుకోలేదన్నారు.
తెలంగాణలో కెసిఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందన్నారు. కెసిఆర్ విధానాల వల్లే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. మీకు ముఖ్యమంత్రి ఉంటే..మాకు ప్రధానమంత్రి ఉన్నారని టిఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారన్నారు. డిసెంబర్ నెలలో తన కూతురు పెళ్లి చేస్తానని, ఇక ఆ తర్వాత కెసిఆర్ పెళ్లి చేస్తానని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు, తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు.

రైతుకు, తెలంగాణ ప్రజలకు ముల్లు గుచ్చుకుంటే పన్నుతో పీకేస్తానని చెప్పిన కెసిఆర్, ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీన బంద్‌తో కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాలన్నారు.
రైతు భరోసా యాత్రలో ఎర్రబెల్లికి నిలదీత!
రైతు భరోసా యాత్రలో ఎర్రబెల్లి దయాకర రావును ఓ వ్యక్తి నిలదీసినట్లుగా తెలుస్తోంది. ఆయితే, ఆయన ఏం అన్నారో తెలియాల్సి ఉంది. నిజామాబాద్ రైతు భరోసా యాత్రలో ఎర్రబెల్లిని నిలదీయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో, టిడిపి కార్యకర్తలు ఆయనను తరిమి కొట్టారు.
నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట టిడిపి ధర్నా
నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట టిడిపి గురువారం ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఉమామాధవ రెడ్డి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటోందన్నారు. ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు.












Click it and Unblock the Notifications