ఎవరో అడిగితే రాలేదు.. ఎవరితోనూ పొత్తులు అక్కర్లేదు.. వైఎస్ పేరు చాలు,మాదే అధికారం : షర్మిల
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని వైఎస్ షర్మిల అన్నారు. 'ఎవరు భయపడవద్దు.. రాబోయే ఎన్నికల్లో మన పార్టీ అధికారంలో వస్తుంది. మనకు ఎవరితో పొత్తులు అవసరం లేదు. మనం టీఆర్ఎస్ చెప్తే వచ్చిన వాళ్ళం కాదు... బీజేపీ అడిగితే వచ్చిన వాళ్లం కాదు. మనకు ఎవరూ అవసరం లేదు. ఆ దేవుడు మనకు అండగా ఉన్నాడు... ఆపై ప్రజల ఆశీర్వాదం ఉంటుంది...' అని షర్మిల తమ పార్టీ నేతలతో చెప్పారు. గురువారం(మార్చి 25) హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో 33 జిల్లాల ముఖ్య నేతలతో షర్మిల సమావేశమయ్యారు.

ఏ పార్టీకి ఏజెంటును కాదు : షర్మిల
తాజా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని అన్నారు. గతంలో తన తన తండ్రి వైస్సార్ ఏప్రిల్ 9వ తేదీనే పాదయాత్ర ప్రారంభించారని... అదే రోజు మొదటి ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. అదే రోజు రాజకీయంగా మన మొదటి అడుగువేద్దామని నేతలతో అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏప్రిల్9న నిర్వహిస్తున్న సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. తాను ఏ పార్టీకి ఏజెంట్‌ని కాదని, తమకు ఎవరి పొత్తు అక్కర్లేదని స్పష్టం చేశారు.

వైఎస్ పేరు చాలు..
టిఆర్‌ఎస్ అడిగితేనో లేక బీజేపీ అడిగితేనో తాను రాజకీయాల్లోకి రాలేదని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు. ఒక్క వైఎస్ పేరు చాలు అని... ఆ పేరుతోనే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.షర్మిల టీఆర్ఎస్ సంధించిన అస్త్రమని,లేదు బీజేపీ సంధించిన అస్త్రమని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. ఖమ్మం సభకు సంకల్ప సభ అని నామకరణం చేసినట్లు తెలిపారు. తమ సంకల్పం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం సభకు సంబంధించిన వాల్ పోస్టర్, జెండాను షర్మిల ఆవిష్కరించారు. జెండా, పోస్టర్లు ఈ సభకు మాత్రమే సంబంధించినవని, తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

ఖమ్మం సభకు షర్మిల రూట్ మ్యాప్..
షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి ఖమ్మం సభ రూట్ మ్యాప్ వెల్లడించారు. ఏప్రిల్ 9 ఉదయం 8 గంటలకు షర్మిల హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం బయలుదేరుతారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లాకు చేరుకుంటారని.. 5 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పారు. నిజానికి లక్ష మందితో ఈ సభను భారీగా నిర్వహించాలని భావించినప్పటికీ ఖమ్మం పోలీసులు షర్మిలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితోనే సభ నిర్వహించుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారు.












Click it and Unblock the Notifications