అన్యాయం: 'దక్షిణ తెలంగాణ' నినాదం కెసిఆర్‌కి చిక్కులు తెస్తుందా?
రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కొత్త నినాదం పుట్టుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం నాడు రంగారెడ్డి జిల్లా సమావేశంలో కొత్త నినాదం వినిపించింది.
దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు, జై దక్షిణ తెలంగాణ అని నినదించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ప్రాజెక్టుల అమలులో దక్షిణ తెలంగాణకు కెసిఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సిఎం కెసిఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కోసం రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

దక్షిణ తెలంగాణ నినాదం ఇప్పుడే కొత్తగా ఏమీ రాలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన కొద్ది రోజులకే పలువురు నేతలు దక్షిణ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
మాజీ మంత్రి డికె అరుణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తదితరులు దక్షిణ తెలంగాణకు కెసిఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు.
ఉత్తర తెలంగాణ వారి ఆధిపత్యం దక్షిణ తెలంగాణలో ఎందుకని డికె అరుణ కొద్ది నెలల క్రితం ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా, ప్రాజెక్టుల అమలులో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే, ఈ నినాదానికి ఎంతమేరకు వారికి కలిసి వస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications