సమగ్ర కుటుంబ సర్వే తర్వాత ప్రభుత్వ పథకాలకు కోత విధిస్తారా?
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుంది. రాష్ట్రంలో కులాల లెక్క తేల్చుకోవటం కోసం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే పైన ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ సర్వేలో సేకరిస్తున్న వివరాలతో తమకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు కోత పడే అవకాశం ఉందని, చాలా చోట్ల ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
సమగ్ర కుటుంబ సర్వేపై అనుమానాలు... క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
ఈ క్రమంలో ప్రజలకు అనుమాన నివృత్తిని కలిగించేలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమగ్ర కుటుంబ సర్వే పైన క్లారిటీ ఇచ్చారు.
సమగ్ర కుటుంబ సర్వే అమలుతీరును పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే కారణంగా సంక్షేమ పథకాలకు ఎటువంటి కోత ఉండదని వెల్లడించారు. ఈ సర్వేలో ఇచ్చిన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

అసమానతలు తొలగించే సర్వే
సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఎటువంటి అనుమానాలు, ఆందోళనలు లేకుండా సర్వే కోసం వస్తున్న గణకులకు సహకరించి పూర్తి వివరాలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్రంలోనే చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు కూడా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ పథకాలలో కోత.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం
ఇక ఇదే విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా వెల్లడించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాలలో కోత విధించబోమని, ప్రజలలో ఉండే అపోహలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన ఇటీవల జిల్లా కలెక్టర్లకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు.
ప్రజల అపోహలు తొలగించే ప్రయత్నం
ప్రజలకు ఉన్న అనుమానాలను తొలగించి వారికి పూర్తిగా భరోసా కల్పిస్తూ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు. మొత్తంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే విషయంలో చోటు చేసుకున్న అనేక అనుమానాలతో మంత్రులు దీనిపైన క్లారిటీ ఇస్తున్నారు. ప్రజల అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications