TS Polls: తెలంగాణలో మారిన లెక్క-కేసీఆర్ కు మిగిలిన ఆప్షన్ అదే ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ తో పాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ వంటి పార్టీలు రంగంలో ఉన్నాయి. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా ఎలాగైనా అఢ్డుకోవాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.
సరిగ్గా ఆరు నెలల క్రితం కర్నాటక ఎన్నికలు జరగకముందు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న పోరు కాస్తా... ఆ తర్వాత వెలువడిన ఫలితాలతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోవడమే కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్నంత ఊపు కూడా వచ్చింది. దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు అన్నీ ఆగిపోయాయా అంటే అదీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి బంపర్ ఆఫర్ లా తెలంగాణలో ఆధిక్యం వచ్చేసింది.

ఇదే ఊపులో కాంగ్రెస్ విడుదల చేసిన సంక్షేమ గ్యారంటీల మ్యానిఫెస్టో సహజంగానే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేలా ఉంది. దీంతో అధికార బీఆర్ఎస్ సైతం దానికి పోటీగా మరిన్ని హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసింది. కానీ గతంలోలా అభివృద్ధి,ఇతర కీలక అంశాల్ని పక్కనబెట్టి కాంగ్రెస్ సంక్షేమానికి రెండింతలు సంక్షేమం చేస్తామనేలా ఈ మ్యానిఫెస్టో ఉంది. దీంతో కాంగ్రెస్ ట్రాప్ లో బీఆర్ఎస్ పడిందనే చర్చ సాగుతోంది.
అలాగే గత తొమ్మిదేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని బలంగా చెప్పుకుంటుందని భావించిన బీఆర్ఎస్.. మారిన పరిస్దితుల్లో వాటి కంటే తిరిగి తెలంగాణ సెంటిమెంట్ నే నమ్మకోవాల్సిన పరిస్దితి ఉందని క్షేత్రస్దాయిలో ట్రెండ్స్ సూచిస్తున్నాయి. సీఎం కేసీఆర్ తాజాగా బహిరంగ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలనే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. గతంలో ఆంధ్రా పాలనలో తెలంగాణ ప్రాంతం ఎలా నష్టపోయింది, బీఆర్ఎస్ వచ్చాక ఎలా అభివృద్ధి సాధించింది, తిరిగి కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఆ పాత పరిస్ధితులు రిపీట్ అవుతాయన్న అంశాల్ని కేసీఆర్ ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.
దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే తిరిగి తెలంగాణ సెంటిమెంట్ ను ప్రయోగించక తప్పదనే అంచనాలో కేసీఆర్ కనిపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తుండటం, తమతో పోటీ పడుతున్న పార్టీలన్నీ తెలంగాణ అజెండాతోనే ఉండటంతో సెంటిమెంట్ అజెండాకు కూడా కాలం చెల్లిందన్న చర్చ జరుగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా బీజేపీతో పోరు పేరిట కేసీఆర్ చేసిన హంగామాకూ, ఆ తర్వాత వ్యవహరించిన తీరుకూ పొంతన లేకపోవడమే ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్ధితికి కారణమనే చర్చ తెలంగాణలో ఎక్కువగా జరుగుతోంది. అదే కాంగ్రెస్ కు ఎక్కువగా మేలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications