అల్లు అర్జున్ పై రేవంత్ కోపం చల్లారిందా లేదా ? తేలేది అక్కడే..!
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో పాటు నాంపల్లి కోర్టులోనూ బెయిల్ ను వ్యతిరేకించింది. దీంతో హైకోర్టుకు వెళ్లి అల్లు అర్జున్ బెయిల్ తెచ్చుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు రాత్రి జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాకుండా చేశారన్న చర్చ సాగుతోంది. తాజాగా అసెంబ్లీలో అల్లు అర్జున్ పై రేవంత్ ఆగ్రహం స్పష్టంగా కనిపించింది. దీంతో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత టాలీవుడ్ పెద్దలు రేవంత్ ను కలిశారు. దీంతో వివాదం సమసిపోయిందా అంటే..
తాజాగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ లో టాలీవుడ్ పెద్దలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి వారికి సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను చూపించారు. ఇందులో ఎవరి తప్పు ఏంటన్నది వారికి చెప్పేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఇండస్ట్రీ వైపు నుంచి సంధ్య థియేటర్ ఘటనను ఎవరూ ప్రస్తావించలేదు. దీంతో సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముందో తెలిసే ఇలా టాలీవుడ్ పెద్దలు మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.

అయితే టాలీవుడ్ పెద్దలతో భేటీ తర్వాత అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి ఆగ్రహం చల్లారిందా లేదా అన్నది తెలియరాలేదు. దీంతో రేవంత్ రెడ్డి మనసులో ఏముందన్న చర్చ జరుగుతోంది. ఇవాళ నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. దీంతో ఈ నెల 30కి విచారణ వాయిదా వేసింది. ఆలోపు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని నాంపల్లి కోర్టు పీపీకి సూచించింది.
ఇప్పుడు నాంపల్లి కోర్టుకు ప్రభుత్వం అల్లు అర్జున్ బెయిల్ పై తన అభిప్రాయం చెప్పాల్సిన పరిస్ధితి వచ్చింది. గతంలో ఇదే కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ వ్యతిరేకించిన ప్రభుత్వం.. ఇప్పుడు టాలీవుడ్ భేటీ తర్వాత అభిప్రాయం మార్చుకుంటుందా లేక అదే అభిప్రాయంతో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు వంటి విషయాల్లో ఓసారి తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గబోనని రేవంత్ తేల్చిచెప్పేశారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ వెనక్కి తగ్గుతారా లేక పాత వైఖరికే కట్టుబడతారా అన్న దానిపై ఆయన బెయిల్ ఆధారపడి ఉంది.












Click it and Unblock the Notifications