'అతన్ని ఉరితీయండి.. నాలాంటి పరిస్థితి మరొకరికి రావద్దు': చావు బతుకుల్లో బీటెక్ యువతి
నిజామాబాద్: ప్రేమ పేరుతో ప్రియుడి వంచనను తట్టుకోలేక ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తాను చనిపోయిన ఫర్వాలేదని, కానీ తనను వంచించిన వాన్ని మాత్రం ఉరితీయాలని ఆమె చెప్పడం గమనార్హం.

ఎవరీ యువతి?:
మాక్లూర్ గ్రామానికి చెందిన రాచర్ల రమ్యకృష్ణ (21) స్థానిక కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పూన ప్రసాద్(21) ప్రేమ పేరుతో యువతికి దగ్గరయ్యాడు. అప్పటికే అతనికి వివాహమైనప్పటికీ.. యువతిని లొంగదీసుకున్నాడు. వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి అతన్ని గుడ్డిగా నమ్మింది.

గల్ఫ్ వెళ్లిన ప్రసాద్..:
5 నెలల క్రితం ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అప్పటినుంచి అతను తనతో మాట్లాడకపోతుండటంతో రమ్యకృష్ణ తీవ్ర ఆందోళనకు గురైంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించకపోయేవాడు. దీంతో రమ్యకృష్ణలో భయం మొదలైంది. ఇదే క్రమంలో ఎట్టకేలకు ఓరోజు రమ్యకృష్ణతో ఫోన్ కాల్ కి స్పందించాడు ప్రసాద్. అయితే అంతకుముందు అతని మాటలకు, అప్పటి మాటలకు రమ్యకృష్ణ షాక్ తిన్నది.

లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్..:
రమ్యకృష్ణ ప్రసాద్ తో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అతను కొట్టిపారేశాడు. పైగా నీ ఫోటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయని, ఇలాగే ఒత్తిడి చేస్తే.. వాటిని బయటపెడుతానని బెదిరించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. తన స్నేహితులకు సైతం ప్రసాద్ ఈ విషయాలను ప్రచారం చేస్తున్నాడని రమ్యకృష్ణ తెలుసుకుంది. దాంతో మరింత కుమిలిపోయింది. తనను నమ్మించి ఇంతలా వంచించాడన్న బాధతో సోమవారం ఇంట్లోనే ఒంటికి నిప్పంటించుకుంది.

అతన్ని ఉరితీయండి..: బాధితురాలు
బాధితురాలు రమ్యకృష్ణ ప్రస్తుతం 90శాతం కాలిన గాయాలతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంతకుముందు నిజామాబాద్ మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో ప్రసాద్ ను ఉరితీయాలని యువతి కోరింది. 'నేను చచ్చినా పర్వాలేదు. అతనికి ఉరిశిక్ష వేయాలి' అని డిమాండ్ చేసింది. అలా అయితేనే మరో యువతి అతని చేతిలో మోసపోదని పేర్కొంది.












Click it and Unblock the Notifications