భర్తతో గొడవ: ఇద్దరు పిల్లల ఉసురు తీసిన మహిళ, లొంగుబాటు
హైదరాబాద్: ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. భర్తతో గొడవల కారణంగా మహిళ తన ఇద్దరు పసి పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది. హైదరాబాదులోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివలాల్‌నగర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉప్పుగూడకు చెందిన రోజాపాండే (21) శివలాల్‌నగర్‌లో నివసించే సుమిత్‌ప్రసాద్‌పాండే ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సుమిదిపాండే (5), చింకీపాండేలు (ఏడాదిన్నర) అనే పిల్లలు ఉన్నారు. నెలరోజుల నుంచి సుమిత్ ఆటో నడపకపోవడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తాయి.

దాంతో భార్యాభర్తల మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరిగేవి. చివరకు కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా మారడంతో క్షణికావేశానికి గురైన రోజాపాండే ఆదివారం సాయంత్రం ఆరుగంటల సమయంలో గది తలుపు పెట్టుకుని తన పెద్ద కూతురు సుమిదిపాండేను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపింది.
ఆ తర్వాత చింకీపాండే గొంతును వైర్‌తో బిగించి ప్రాణాలు తీసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు చిన్నారులను చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన రోజాపాండే పోలీసులకు లొంగింపోయింది. హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఇప్పుడు గర్భవతి అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications