కొడుకుతో అక్రమ సంబంధమని భార్యను కొట్టాడు: భర్తను చంపేసింది
కొడుకుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నావని తన భర్త పెట్టిన వేధింపులను ఓ మహిళ భరించలేకపోయయింది. దాంతో అతన్ని చంపేసింది.
హైదరాబాద్: తాళి కట్టిన భర్తనే ఓ మహిళ పొట్టన పెట్టుకుంది. ఆమెతో పాటు ఆమె కుమారుడిని, హత్యకు సహకరించిన మరో వ్యక్తిని హైదరాబాదులోని రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ వివరాలు వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ప్రాంతానికి చెందిన సత్యవతికి రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దె గ్రామానికి చెందిన కోట్ల రవీందర్ (44)తో 21 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు. రవీందర్ భార్యను నిత్యం కొడుతుండేవాడు. ఈ విషయం మరిది శేఖర్‌తో చెప్పింది. అతడు అన్న రవీందర్‌ను పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలోగల జిడ్డు రామకృష్ణమూర్తి ట్రస్ట్‌లో డ్రైవర్‌గా పనిలో పెట్టించాడు.

సత్యవతి కూడా అక్కడే హౌస్‌కీపింగ్ పనిచేసేది. వారి కుమారుడు సాయికుమార్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. రవీందర్ భార్యను ఇటీవల అనుమానిస్తూ వేధించడం ప్రారంభించాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని నిందించేవాడు. ఈనెల 2వ తేదీన తాగి భార్యతో గొడవపడ్డాడు. కుమారుడితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నావని అనడంతో ఆగ్రహం చెందిన ఆమె ఇంట్లోని రోకలి బండతో భర్త తలపై కొట్టగా అక్కడికక్కడే మరణించాడు.
అదే సమయంలో కుమారుడు ఇంటికి వచ్చాడు. తాగి వచ్చి తిట్టడంతో రోకలి బండతో కొట్టగా చనిపోయాడని చెప్పింది. సాయికుమార్ విషయాన్ని స్నేహితుడు మియాపూర్ నివాసి వడ్ల నరేశ్‌చారికి చెప్పాడు. ఇద్దరూ కలిసి రవీందర్ మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి ఆటో ట్రాలీలో తీసుకెళ్లి మూసీ నదిలో పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
రవీందర్ హత్య కేసులో భార్య సత్యవతి పాత్ర ఉన్నట్టు అనుమానం రావడంతో ఆమెను ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. సత్యవతి, సాయికుమార్, వడ్ల నరేశ్‌చారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.












Click it and Unblock the Notifications