మహిళల అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు: 9మంది దళారుల అరెస్ట్

Subscribe to Oneindia Telugu

ఆసిఫాబాద్‌: కొమురంభీం జిల్లాలో మహిళల అక్రమ రవాణా ముఠా రాకెట్ గుట్టురట్టయింది. కొన్నాళ్లుగా చాపకింద నీరులాసాగిన ఈ దందా తాజాగా పోలీసులకు చిక్కడంతో ముఠా సభ్యుల్లో వణుకుపుడుతోంది. జిల్లాలోని గిరిజన ఆదివాసి తండాల్లో అమాయక గిరిజన మహిళలకు మాయమాటలు చెప్పి వారి తల్లిదండ్రులకు డబ్బులను ఎరవేసి ఇతర రాష్ట్రాల్లోని మండలాలకు తరలించడం, పెళ్లిళ్లు చేయడం దీనికి ప్రతిఫలంగా దళారులు సొమ్ముచేసుకోవడం, పరిపాటిగా మారింది.

కొన్ని మారుమూల ప్రాంతాలతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్‌, జన్నారం, కెరమెరి, నార్నూర్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి చోటు చేసుకున్న సంఘటనలు సైతం ఉన్నాయి. అయితే తాజాగా ఆసిఫాబాద్‌ మండలంలోని బనర్‌గొంది గిరిజన గ్రామానికి చెందిన యువతి కనిపింకుండాపోయే సరికి సదరు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసుతో సంబంధం ఉన్న 9 మంది దళారులను అదుపులోకి తీసుకొని కూపీలాగారు. వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించగా మరికొంతమంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారు కూడా దొరికితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

women trafficking racket busted

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం రైతుపాలెం-విజయనగర్‌ గ్రామాల మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాలు ప్రకారం...నందిపేటకు చెందిన దాబా గంగాధర్‌ కుమారుడు కొండి శశాంత్‌(16), ఇదే గ్రామానికి చెందిన తల్వేద చిన్నయ్య కొడుకు శశికుమార్‌(16) మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీ వాసులు.

శశాంత్‌ నందిపేటలోని సాయి కళాశాలలో ఇంటర్‌ చదువుతూ తండ్రికి దాబా హోటల్‌లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. శశికుమార్‌ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. అయితే సోమవారం పరీక్షలు ముగియంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో తల్వేద శశికాంత్‌ స్వగ్రామానికి వచ్చాడు.

శశాంత్‌ తండ్రి దాబా గంగాధర్‌ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మంగళవారం ఉదయం జిల్లా కేంద్రం నుంచి తన తండ్రికి మందులు తీసుకొచ్చేందుకు తన స్నేహితుడు శశికుమార్‌ను తీసుకొని ద్విచక్రవాహనంపై వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో విజయనగర్‌-రైతుపాలెం సమీపంలోనికి రాగానే ఎరురుగా వస్తున్న వీరు ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ జాన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కువైట్‌లో కమలాపూర్‌ వాసి మృతి

కమలాపూర్‌: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద.. చేసేందుకు పని లేక ఉపాధి వేటలో బతుకు దెరువు కోసం అప్పు చేసి దేశం కాని దేశం వెళ్లి అనారోగ్యం కాటేయడంతో తిరిగి రాని లోకాలకు చేరిన సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో చోటు చేసుకుంది. కువైట్‌లోని ఓ సంస్థలో దినసరి కూలీగా పని చేసి జీవనం సాగించే కమలాపూర్‌కు చెందిన గూళ్ల కుమారస్వామి(40) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్థులు తెలిపారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. కుమారస్వామి రెండున్నరేళ్ల కిందట కువైట్‌కు వెళ్లి ఓ సంస్థలో దినసరి కూలీగా పని చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం తండ్రి సంవత్సరికం కోసం స్వదేశం వచ్చి వెళ్లారు. ఇటీవల అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. అక్కడి నిబంధనల ప్రకారం మృతదేహం రావడం ఆలస్యమవుతుందనే ఉద్ధేశంతో కుటుంబ సభ్యులకు విషయం మంగళవారం వరకూ చెప్పలేదన్నారు.

మంగళవారం బంధువుల ద్వారా విషయం తెలియడంతో కుటుంబ సభ్యుల బోరున విలపించారు. మృతునికి భార్య, కూతురు కొడుకు ఉన్నారు. మృతదేహం త్వరగా రప్పించేందుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌ భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిల దృష్టికి విషయం తీసుకెళ్లామని, వారి చొరవతో కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్‌ కువైట్‌ అధికారులతో మాట్లాడారన్నారు. గురువారం వరకు మృతదేహం ఇల్లు చేరే అవకాశముందని బంధువులు పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మృతదేహం త్వరగా వచ్చేలా చర్యలు చేపట్టాలని, ఆర్థికంగా చితికిపోయిన తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Women trafficking racket busted in Asifabad district, 9 persons arrested.
Please Wait while comments are loading...