15వందల ఏళ్ళనాటి బర్మా టేకుతో అద్భుత అనంత శయన మహావిష్ణువు కళాఖండం.. ప్రత్యేకతలివే!!
ప్రపంచంలోనే అతి పెద్దదైన అనంత శేష శయన శ్రీ మహా విష్ణు మూర్తి ఏకాండీ బర్మా టేకు శిల్పాన్ని బోయిన పల్లి కి చెందిన అనురాధ టింబర్ ఎస్టేట్స్ వారు అత్యద్భుతంగా రూపొందించారు. ఇక ఈ శిల్ప కళాఖండాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ శిల్పం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.
21 అడుగుల పొడవు, 80 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన టేకు దుంగను బోయినపల్లి అనురాధ టింబర్స్ ఎస్టేట్స్ వారు బర్మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేలంపాటలో దక్కించుకున్నారు. మయన్మార్ దేశ అడవుల్లో 1500 ఏళ్ళనాటి బర్మా టేక్ దుంగను దక్కించుకున్న వారు ఐదు సంవత్సరాల పాటు అనుమతులు పేరిట అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఆపై సకల దేవతా మూర్తులతో కలగలిసిన శిల్పాల కలయికతో శ్రీ అనంత శేష శయన శ్రీ మహా విష్ణు మూర్తి ఏకాండీ దారు శిల్పంగా దీనిని తయారు చేయించారు. మహా విష్ణువు పవళించిన సజీవ శిల్పంగా దారు శిల్పాన్ని మలచడం కోసం చిత్రకారుడు గిరిధర్ గౌడ్ తో పలు రేఖా చిత్రాలను రూపొందించి, మయన్మార్ దేశ ప్రభుత్వ అనుమతితో అక్కడి శిల్పుల తో కళాఖండాన్ని చెక్కించారు.
అనంతరం ఈ కళాఖండాన్ని భారత్ కు రప్పించి మహాబలిపురం చిత్రకారులతో తుది మెరుగులు దిద్దించారు. ఇక ఈ శిల్పకళా ఖండాన్ని భగవద్గీత లోని పదకొండవ అధ్యాయం 6 వ శ్లోకం ఆధారంగా రూపొందించారు. అనంత శేష శయన శ్రీమహావిష్ణువుతో బాటు, శ్రీదేవి, భూదేవి చిత్రాలతో పాటు 84 చిన్న కళాఖండాల కలయికతో ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు.
ఇక ఈ అద్భుత కళా ఖండం ఆవిష్కరించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనురాధ టింబర్ ఎస్టేట్స్ చదలవాడ శ్రీనివాసరావు, తిరుపతి రావు కుటుంబ సభ్యులు చేసిన మహత్కార్యానికి అభినందనలు తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు పవళించిన అద్భుత దృశ్యాన్ని సజీవ శిల్పంగా మలచడం గొప్ప ఆధ్యాత్మిక భావనను కలిగించిందన్నారు. శిల్ప కళాకారులతో పాటు, చదలవాడ కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఇక ఈ మహత్కార్యంలో భాగస్వాములైన బర్మా కు చెందిన చిత్రకారులను, మహాబలిపురం చిత్రకారులను ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications