టిడిపి టార్గెట్: హైదరాబాదులో వైయస్ షర్మిల యాత్ర
హైదరాబాద్: ఇటీవల తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి హైదరాబాదు పర్యటనకు కూడా సిద్ధమవుతున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఆమె త్వరలో పర్యటించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంఎస్) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ యాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ చీఫ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో కొద్ది సీట్లయినా గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు షర్మిల యాత్ర పనికి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
నిరుడు జరిగిన శాసనసభ, లోకసభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో తమ పార్టీకి మంచి ఆదరణ లభించిందని, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో తమకు ఓట్లు దండిగానే పడ్డాయని, అందువల్ల జిహెచ్ఎంసి ఎన్నికల్లో కొన్ని సీట్లనైనా సాధించుకునే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ పార్టీని పూర్తిగా మూసేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో తన క్యాడర్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. తాము రంగం మీది నుంచి తప్పుకుంటే తమ కార్యకర్తలు కాంగ్రెసుకు గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ వెళ్తారని, దానివల్ల ఆ పార్టీలు లాభపడే అవకాశం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అనుకుంటున్నారు.
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలను తగ్గించుకుంటే, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసే వ్యూహంతోనే షర్మిల తెలంగాణలో పర్యటనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు ఏ కొద్దిపాటి ఓట్లను సాధించుకున్నా అది తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి ఉపయోగపడే అవకాశం ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications