యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఈవో గీతా రెడ్డి రాజీనామా: ఎందుకంటే?
యాదాద్రి భువనగిరి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈవో పదవికి ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిదేళ్లుగా దేవస్థానం ఈవోగా కొనసాగుతున్న గీతారెడ్డి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.
2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం.. 1200 కోట్ల రూపాయలతో యాదాద్రిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పనుల పర్యవేక్షణకు యాదగిరిగుట్ట దేవస్థానం డెవలప్మెంట్ అథారిటీ(YTDA)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2020లో పదవి విరమణ అనంతరం కూడా తిరిగి ప్రభుత్వం ఆమెనే ఈవోగా కొనసాగించింది.

అయితే ఆలయ ఈవో గీతపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. స్థానిక సమస్యల పరిష్కారంలో ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావులు విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. మరోవైపు, ఆలయ నగరిలో నిర్మిస్తున్న దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గీతారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.
ఆలయ పునర్నిర్మానం వల్ల భక్తులకు సేవలు, సౌకర్యాల కల్పనలో గీతారెడ్డి విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నింటిని సీరియస్‌గా తీసుకున్న తాజా ప్రభుత్వ దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
యాదాద్రి ఆలయ కొత్త ఈవోగా రామకృష్ణ
మరోవైపు యాదాద్రి ఆలయ నూతన ఈవోగా రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. దీంతో గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 23వ తేదీన ఆలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications