తెలంగాణలో మహాకూటమికి వ్యతిరేకంగా వైసీపి ప్రచారం...! గులాబీ పార్టీకి మద్దత్తిస్తున్న జగన్..!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రం నేతలు కూడా తెలంగాణ ఎన్నికల్లో తమ ప్రభావం చూపాలని తాపత్రయ పడుతున్నారు. తెలంగాణలో తెలంగుదేశం పార్టీ క్యాడర్ ఉందని, అందుకే ఆ పార్టీ గెలుపుకోసం నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాని ఎటువంటి పార్టీ ఉనికి లేని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో తన ప్రాభల్యాన్ని చాటుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణలోని కొన్ని నియోజక వర్గాల్లో వైసీపి నేతలు పర్యటించి మహాకూటమికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మహా కూటమి ఓడిపోతే ఆంద్రాలో జగన్ కు ఆటోమేటిక్ గా నైతిక స్థైర్యం వస్తుందనే పాయింట్ ఆధారంగా తెలంగాణ ఎన్నికల్లో జగన్ కూటమికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో వైసీపి..! కూటమికి వ్యతిరేకంగా ప్రచారం..!!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 13 నెలలుగా ప్రజాసంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం మిగిలిన వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. జగన్ యాత్రకు విరామం దొరికినప్పుడల్లా పార్టీ వ్యవహారాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, ఏపీలో ప్రతిపక్షంగా ఉంటూనే జగన్ తెలంగాణ రాజకీయాల పట్ల ద్రుష్టి సారించినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో కూటమి ఓడితే ఏపిలో ఎదురుండదు..! జగన్ మాస్టర్ ప్లాన్..!!
ఏపీలో ప్రభుత్వ విధానాలను నిలదీస్తున్నా అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదని వైసీపి భావిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ప్రకటించింది.

సామాజిక వర్గాల వారీగా సమావేశాలు..! పావులు కదుపుతున్న వైసీపి అధినేత..!!
వైసీపి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఏదో ఒక పార్టీకి మద్దతు తెలుపుతుందని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ, హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం టీఆర్ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న కూకట్‌పల్లిలో ఆ పార్టీ నేతలు సమావేశం కూడా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా కూకట్‌పల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంత మంది రాయలసీమ నేతలు కూడా తెలంగాణలో సెటిల్ ఐన రెడ్డి సామాజిక కుటుంబాలతో సమావేశాలు నిర్వహించి కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ కి ఓటేయండి..! తెలంగాణలోని సీమాంద్రులకు వైసీపి సూచనలు..!
వైసీపి ఎలాంటి హడావిడి లేకుండా టీఆర్‌ఎస్‌కు బహిరంగంగానే మద్దతు పలుకుతోందనే కథనాలు వినిపిస్తున్నాయి. సీమాంధ్ర సెటిలర్స్ ఫోరం పేరుతో వైసీపీ నేతలు ఏకంగా కేటీఆర్‌తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సరిహద్దు జిల్లాల్లో వైసీపీ నేతలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని కూడా వినవస్తోంది. దీంతో ఏపీలో టీడీపీ ప్రభుత్వం పై అలుపెరగని పోరాటం చేస్తూనే తెలంగాణలో కూడా తన మార్కు రాజకీయం జరుపుతున్నారి లోటస్ పాండ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications