year ender 2022: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదే ఎక్కువగా నేరాలు..కంప్లీట్ క్రైమ్ రిపోర్ట్
2022 సంవత్సరానికిగానూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించి వార్షిక నేర నివేదికను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేడు విడుదల చేశారు. ఈ నేర నివేదికలో 2021 సంవత్సరంతో పోలిస్తే నేరాలు మొత్తం 2022 సంవత్సరంలో 19 శాతం పెరిగాయని వెల్లడించారు.

మహిళలపై నేరాలు... సైబర్ నేరాలు ఎలా ఉన్నాయంటే
ముఖ్యంగా ఈ సంవత్సరం మహిళలపై నేరాలు 17 శాతం పెరిగాయని, ఆస్తి నేరాలు 23 శాతం పెరిగాయని పేర్కొన్నారు. అన్నిటికంటే అత్యధికంగా ఈ సంవత్సరం సైబర్ నేరాలు 66 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఇక రోడ్డు ప్రమాదాల కేసులు కూడా 19 శాతం పెరిగాయని, ప్రమాదాలలో మరణాలు మాత్రం 0.91 శాతానికి తగ్గాయని వెల్లడించారు.

2022లో హత్యలు, అత్యాచార కేసుల పరిస్థితి ఇలా
2022 సంవత్సరంలో ముఖ్యంగా హత్యలు 29 శాతం తగ్గాయని, కిడ్నాప్ లు కూడా 38 శాతం తగ్గాయని తెలిపారు. అత్యాచార కేసులు 1.33% తగ్గాయి అని పేర్కొన్న సీపీ మహేష్ భగవత్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో వరకట్న మరణాలు 5.88% తగ్గాయన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన నరహత్య కేసులు 50 శాతం తగ్గాయని, రెండు శాతం బలహీన వర్గాలపై నేరాలు తగ్గాయన్నారు. అటెన్షన్ డైవర్షన్ కేసులు 11.67 శాతం తగ్గాయని పేర్కొన్నారు.
డ్రగ్స్ పై 2022 నేర నివేదికలో అంశాలివే
ఆస్తి కేసుల్లో ఆస్తి రికవరీ రేటు 57శాతం నుండి పెరిగింది 63 శాతంకి పెరిగిందని పేర్కొన్నారు. ఎన్‌డిపిఎస్ కేసుల అమలు 140 శాతం పెరిగిందని , PITA కేసులు 3 శాతం తగ్గాయన్నారు. గుట్కా కేసులు 131 శాతం తగ్గాయని పేర్కొన్నారు. 2022 సంవత్సరం లో 94 మంది డ్రగ్స్ నేరస్తులను పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
మొత్తం 7502.8 కిలోల గంజాయిని 2022 సంవత్సరం లో స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. 83.89 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన సీపీ మహేష్ భగవత్, 73 గ్రాముల హెరాయిన్, 63.35 గ్రాముల MDMA, 38 గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మారుతున్న నేరాల సరళి .. రోజూ కొత్త పోలీసింగ్ చేస్తున్నామన్న సీపీ మహేష్ భగవత్
రాష్ట్రంలో మారుతున్న టెక్నాలజీ తో పాటు కొత్త కొత్త నేరాలు కూడా చోటుచేసుకుంటున్నాయని, వాటన్నింటినీ చాలెంజింగ్ గా తీసుకొని ప్రతిరోజు కొత్త పోలీసింగ్ విధానంతో రాచకొండ పోలీసులు ముందుకు వెళ్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పోలీసులు తమ ముందు ఈ సంవత్సరం వచ్చిన ప్రతి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అని, కేసులను త్వరితగతిన విచారించి, నేరస్తులను పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు కీలకంగా పని చేశారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ గా తనుకు ఆరున్నరేళ్ళుగా అవకాశం కల్పించిన ప్రభుత్వం, తనపై ఉంచిన నమ్మకాన్ని శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా చూపించానని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications