year ender 2024: ఆ దెబ్బకు సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా వణికిపోయారు!
2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టించింది. తెలంగాణలోని హైదరాబాద్లో చెరువుల అక్రమ నిర్మాణాలపైన కూల్చివేతల దిశగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొని హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చింది. హైదరాబాదులో చిన్నపాటి వర్షానికి కాలనీలు, రహదారులు ముంపుకు గురవుతున్న నేపథ్యంలో ఆ పరిస్థితులను మార్చాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రాకు అధికారాలిచ్చారు.
100 రోజుల వ్యవధిలో 300 నిర్మాణాల కూల్చివేతలు
ఎఫ్టీఎల్ పరిధిలోను , బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో నేటికీ హైడ్రా పైన హైదరాబాద్ వాసులలో ఆందోళన కనిపిస్తుంది. నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలు అంటూ అనేక భవనాలను హైడ్రా కూల్చి వేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో దాదాపు 100 రోజుల వ్యవధిలో 30 ప్రాంతాలలో 300 నిర్మాణాలను కూల్చివేయడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో చర్చ
పగలు రాత్రి తేడా లేకుండా, ముఖ్యంగా ఆదివారాలలో కూడా హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. ముఖ్యంగా ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా పేరు మార్మోగింది. హైదరాబాద్లోని హైడ్రా తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఆక్రమణలను తొలగించాలని చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది.
హైడ్రా కూల్చివేతలతో సామాన్యులు లబోదిబో
అమీన్ పూర్, మాదాపూర్, కూకట్ పల్లి ఇలా అనేక చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా చర్యలతో సామాన్యులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని సామాను కనీసం తీసుకోనివ్వకుండా హైడ్రా కూల్చివేతలకు పాల్పడడంతో ఎంతోమంది బాధితులు లబోదిబోమన్నారు. కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు హైడ్రా కూల్చివేతలతో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు హైడ్రాకు పలు ప్రశ్నలకు సంధించి చట్టబద్ధత పైన నిలదీసింది.
ప్రభుత్వ ఆస్తుల రక్షణ పూర్తి బాధ్యత ఇస్తూ ఆర్డినెన్స్
దీంతో హైడ్రాకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దానిని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పంపి ఆయన ఆమోదాన్ని పొందింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రా కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేసే పవర్ ను హైడ్రాకు ఇచ్చింది.
జిహెచ్ఎంసి చట్టంలో కూడా పలు మార్పులు
ఈ మేరకు జీవో నెంబర్ 199 ను విడుదల చేసిన ప్రభుత్వం జిహెచ్ఎంసి చట్టంలో కూడా పలు మార్పులు చేసింది. హైడ్రా కూల్చివేతలకు మాత్రమే కాకుండా చెరువులు కుంటల పునరుద్ధరణకు కూడా రంగంలోకి దిగింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు చెరువులు కుంటలను పునరుద్ధరణ చేస్తూ హైడ్రా వ్యవస్థ 2024 సంవత్సరంలో ఒక బలమైన వ్యవస్థగా ఎదిగింది.












Click it and Unblock the Notifications