ఇష్టం లేని పెళ్లి కొడుకులా వచ్చి..: కేసీఆర్‌పై యెన్నం శ్రీనివాస్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ హాజరుకావడంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఇష్టంలేని పెళ్లి కొడుకులా సభలో కూర్చున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు యెన్నం
శ్రీనివాస్ రెడ్డి.
మీడియా పాయింట్‌ను బహిష్కరించిన కేసీఆరే... ఇప్పుడు అక్కడకు వచ్చి మాట్లాడారన్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ బాగుందని, కానీ, కేసీఆర్ చూడకుండానే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్ అంకెలను చూడలేదని... చదవకుండా ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్లారని మండిపడ్డారు.

పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు రూ.11 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని... కానీ, తాము ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు, బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలకు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు.
ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని, అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును గంగలో కలిపారన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరి అంకెల రూపంలో బడ్జెట్ పెట్టకుండా.. అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు జరగాలని కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. బడ్జెట్ ను తులనాడే విధంగా కేసీఆర్ మాట్లాడారని మండిపడ్డారు. గత బడ్జెట్ పెపర్లకే పరిమితమయ్యిందన్నారు. కేసీఆర్ ఇంకా ఊహల్లో ఉండకుండా.. బడ్జెట్‌ను ఆహ్వానించాలని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ మీడియా పాయింట్ కి వచ్చారని.. త్వరలోనే కోర్టు బోనులోకి కూడా వస్తాడన్నారు. కేసీఆర్ ఊహల్లో బతికిండు.. ఇంకా నేనే రాజు అనుకుంటున్నాడు అని విమర్శించారు. తెలంగాణను అప్పులుపాలు చేశారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications