సోదరిని కామెంట్ చేశాడని కొట్టి చంపేశారు!
హైదరాబాద్: తమ సోదరిని వేధిస్తున్నాడనే కారణంగా ఓ వ్యక్తిని ఆమె సోదరులు తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెంకటరమణ అనే వ్యక్తి నవంబర్ 22వ తేదీన రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించి టీ తాగేందుకు వచ్చారు. అదే సమయంలో శ్రీధర్, అజయ్, పవన్, సురేష్‌లు తమ అక్కతో పాటు అక్కడికి టీ తాగేందుకు వచ్చారు. శ్రీధర్ సోదరిపై వెంకటరమణ కామెంట్ చెయ్యడంతో ఆ నలుగురు అతడిపై దాడికి పాల్పడ్డారు.

అంతేగాక, అక్కడేవున్న ఓ టిఫిన్ సెంటర్లోని చపాతీ కర్రతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో వెంకట రమణ మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. అనంతరం దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సరోగసి కోసం వస్తే మహిళకు వేధింపులు: భవనంపైనుంచి దూకి మృతి
సరోగసీ కోసం వచ్చిన మహిళపై ఓ వ్యక్తి వేధింపులకు దిగాడు. దీంతో ఆమె భవనంపై నుంచి దూకి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం మైహోమ్ భూజా అపార్ట్‌మెంట్స్ 9వ అంతస్తులో రాజేశ్ బాబు (54) నివసిస్తున్నాడు. సందీప్ అనే వ్యక్తి ద్వారా అక్టోబర్ 24న ఒడిశా నుంచి ఓ మహిళను సరోగసీ కోసం తీసుకొచ్చారు.
నెలరోజులుగా ఆమెను బయటకు వెళ్లనీయకుండా రాజేశ్ తన ఫ్లాట్‌లోనే నిర్బంధించాడు. మహిళ వెంట వచ్చిన ఆమె భర్తకు అదే అపార్ట్‌మెంట్‌లో మరో ఫ్లాట్ కేటాయించాడు. ఈ క్రమంలో సదరు మహిళపై రాజేశ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భర్తతో కలవనీయలేదు. రాజేశ్ వేధింపులు భరించలేక సోమవారం అర్ధరాత్రి ఆమె ఆ భవనంపైనుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications