వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్, బాబు మధ్య నిప్పు పెట్టిన జగన్: వారిద్దరిపై టిఆర్ఎస్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews
KCR- Chandrababu

హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టులపై ఆందోళనకు శ్రీకారం చుట్టడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య విభేదాలు సృష్టించడంలో విజయం సాధించినట్లే కనిపిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌ను అడ్డుకోవడానికే అన్నట్లు చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

చంద్రబాబు చేసిన విమర్శలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు, మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. అమరావతి శంకుస్థాపన సమయం నుంచి కెసిఆర్, చంద్రబాబు సయోధ్యతో మెలుగుతున్నారు. అయితే, తాజా పరిణామాలు వారి మధ్య చిచ్చు పెట్టేట్లే కనిపిస్తున్నాయి. వైయస్ జగన్‌పై కూడా టిఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు.

విషం కక్కుతున్నాయి...

ఎపి ప్రభుత్వంతోో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోన్నా ఆంధ్రా పార్టీలు తెలంగాణపై విషం కక్కుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాడని మండిపడ్డారు. తమ హక్కులను కాలరాస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను ఏపీ నేతలు అడ్డుకోలేరని, వారికి ఆ శక్తి లేదని అన్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు వచ్చినా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేరని అన్నారు. వైఎస్‌ఆర్ హయాంలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఆయన కుమారుడు జగన్ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.

వైఎస్ అక్రమ ప్రాజెక్టులు కట్టారు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగిరం చేసిన సాగునీటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకోవాలని, అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా ప్రాజెక్టులను నిలిపివేయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఏపీ కేబినెట్ నిర్ణయం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమ ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా? అని అడిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సమైక్య రాష్ట్రంలోనే అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ప్రాజెక్టులు కట్టితీరుతామన్నారు.

కుట్రలు చేస్తున్నాయి..

మరో మంత్రి మహేందర్‌రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నీరు అందకుండా టీడీపీ, ఏపీ కాంగ్రెస్, వైసీపీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు, రఘువీరారెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని అన్నారు.

కృష్ణా నది నీళ్లను ఏపీకి తరలించుకు పోవడానికి ఏపీ నేతలు పెద్ద కుట్రలు చేస్తున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాశ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చేస్తోన్న కుట్రలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పాలమూరు ప్రాజెక్టుకు డిజైన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇవాళ ఆయన కుమారుడు జగన్ దీక్ష ఎలా చేపడతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.

కెసిఆర్ నిర్ణయాన్ని అపబోం

తెలంగాణలో నిర్మిస్తోన్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి ఉత్తరం రాయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని స్పష్టం చేశారు. తమకు రావాల్సిన నీటి వాటాను మేం వాడుకుంటే మీకెందుకు కడుపు మంట? అని ప్రశ్నించారు.

తమ నీళ్లు తాము వాడుకుంటామంటే వారికి ఎందుకు ఇబ్బంది, బాధ కలుగుతోందని నిలదీశారు. సీఎం నిర్ణయాన్ని ఎవరు అడ్డుకున్నా సహించేదిలేదన్నారు. గతంలో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు సహా ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని తెలిపారు. నిధులు, నియామకాలు అయిపోయాయి, ఇక మిగిలింది నీళ్లేనని స్పష్టం చేశారు.

కృష్ణా, గోదావరి జలాల్లో 1350 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చని గతంలో జీవో ఇచ్చారని పేర్కొన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 9 వందల టీఎంసీలు కేటాయించారని వివరించారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

పాత జీవోలతోనే పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. మన నీటి వాటాను మనం వాడుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని తెలిపారు. జూన్ 30లోగా కృష్ణా పుష్కరాల పనులు పూర్తి చేస్తామన్నారు.

రేవంత్ రెడ్డి చంద్రబాబు మీద పోరాటం చేయాలి...

రేవంత్‌రెడ్డి ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మీద పోరాటం చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. చంద్రబాబు తెలంగాణ విధ్వంసమే ఎజెండాగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులను కట్టితీరుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేక నైజాన్ని బాబు మరోమారు చాటుకున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పనికిరాని ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని బాల్క సుమన్ అన్నారు.

చంద్రబాబు వైఖరి సరి కాదు...

పాలమూరు-రంగారెడ్డి సహా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాంనాయక్‌లు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను నిలువరించే యత్నంలో భాగంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారు మంగళవారంనాడు స్పందించారు.

గతంలో నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ ఆనకట్టలను అడ్డుకోవడం అన్యాయమని వారన్నారు. ఏపీ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, ఎత్తు తగ్గించాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించకపోతే భద్రాచలం దేవాలయం సహా ఆదివాసీలకు తీరని నష్టం జరుగుతుందని, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చట్ట ప్రకారం నడుచుకోవాలని వారన్నారు.

చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి....

చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశారో టీ-టీడీపీ నేతలు చెప్పాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్న ఏపీ ప్రభుత్వ తీరుపై అదేవిధంగా ఎమ్మెల్యేలు డీకే అరుణ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో స్పందించారు.

రాష్ట్రం విడిపోయినా తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టడం దుర్మార్గమని ఏపీలో పాలన చేతకాక తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దని, ఎంత ఖర్చు అయినా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

డీకే అరుణకు ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహన లేదని, వీరిరువురి రాజకీయాలను చూసి పాలమూరు ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. సమైక్య పాలనలో బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని ఆయన అన్నారు. పాలమూరు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.

కేంద్రం నిర్ణయం తీసుకోలేదు...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని తీర్మానాలు చేసినా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్న ఏపీ ప్రభుత్వ తీరుపై ఆయన మంగళవారంనాడు స్పందించారు.

చంద్రబాబు కేబినెట్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఖండిస్తోందని చెప్పారు. కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న వాటాల ప్రకారమే పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, మరిన్ని ప్రాజెక్టులు కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు ఎన్ని తీర్మానాలు చేసినా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుపై పోచారం మండిపాటు

తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటామని అనడం దారుణమని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలను సాధించుకుని తీరుతామని చెప్పారు.

English summary
YSR Congress party president YS Jagan has created rift between Telangana CM K chandrasekhar Rao and Andhra Pradesh CM Nara Chandrababu Naidu on irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X