నేటి నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర - పులివెందుల టూర్ : ఆ తరువాతే నిర్ణయం..!!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు వరి ధాన్యం సేకరణ అంశంపైన రాష్ట్రం వర్సెస్ కేంద్రం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే తెలంగాణ మంత్రులు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ధరల అంశం పైన కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన షర్మిల ఈ రోజు నుంచి రైతు ఆవేదన యాత్ర ప్రారంభిస్తున్నారు.

షర్మిల అయిదు రోజుల యాత్ర
హైదరాబాద్ లోటస్ సాండ్ లోని తన పార్టీ కార్యాలయంలో ఈ రైతు ఆవేదన యాత్ర ఉద్దేశాలను వివరించి..యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతుండటంతో ఆ వేదన చెందిన షర్మిల రైతు ఆవేదన యాత్రను తలపెట్టారు. 23 వరకు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఆ కుటుంబాలకు వైఎస్సార్‌టీపీ తరుఫున సాయం అందజేయనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ వాడు క రాజగోపాల్ ప్రకటించారు.

పార్టీ కార్యాలయం నుంచి రైతు ఆవేదన యాత్ర
ఈ రోజున షర్మిల యాత్ర గచ్చిబౌలి నుంచి నర్సాపూర్ మీదు గా మెదక్ జిల్లాలోని కంచనపల్లికి రైతు ఆవేదన యాత్ర చేరుకుంటుంది. అక్కడ ఆత్మహ త్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. తర్వాత లింగంపల్లిలో మరొక రైతు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పనున్నారు. రెండవ రోజు.. 20న నిజామాబాద్ జిల్లా సైదేశివారినగర్, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల్లో రైతు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. మూడో రోజు.. 21న కరీంనగర్ జిల్లా లో, 22న ఆదిలాబాద్ జిల్లాలో షర్మిల యాత్ర సాగనుంది. చివరి రోజైన 23న అన్నోజీగూడ లో యాత్ర ముగుస్తుందని వారు వివరించారు.

క్రిస్మస్ వేడుకలకు షర్మిల
ఇక, షర్మిల ఈ సారి క్రిస్మస్ వేడుకలకు పులివెందుల కు వెళ్తున్నారా లేదా అనే అంశం పైన అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతీ ఏడాది లాగానే ఈ సారి సైతం క్రిస్మస్ వేడుకలకు పులివెందుల పర్యటన ఖరారైంది. అయితే, గత ఏడాది క్రిస్మస్ కు షర్మిల పులివెందులకు రాలేదు. ఇక, రాజకీయంగా తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత అన్న జగన్ తో కలిసి ఒకే వేదిక పైకి రావటం ప్రతీ సారి చర్చనీయాంశంగా మారుతోంది. సెప్టెంబర్ 2న పులివెందుల లో తమ తండ్రి వైఎస్సార్ కు నివాళి అర్పించే సమయంలో జగన్ - షర్మిల కలిసారు.

పులివెందుల లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారా
ఇక, షర్మిల రాకీ పండుగ నాడు సైతం జగన్ కు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. జగన్ సైతం ఇడుపుల పాయలో కలిసిన సమయంతో తనను పలకరించారని..షర్మిల ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. షర్మిల జన్మదినం నాడు సీఎం జగన్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారంటూ వైఎస్సార్టీపీ నేతలు చెబుతున్నారు. ఇక, ఈ నెల 23న రైతు ఆవేదన యాత్ర ముగిసిన తరువాత మూడు రోజలు పాటుగా షర్మిల క్రిస్మస్ సందర్భంగా రాజకీయంగా ఏ కార్యక్రమం షెడ్యూల్ చేయలేదు.

తెలంగాణ పార్టీ భవిష్యత్ పైన చర్చ
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత తిరిగి తన పాదయాత్ర కొనసాగుతుందని షర్మిల అప్పట్లోనే ప్రకటించారు. అయితే, ఇప్పుడు జనవరి తొలి వారంలో షర్మిల తిరిగి తన పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ప్రభావంతో పాటుగా.. క్రిస్మస్ సమయంలో షర్మిల పులివెందుల పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది. తెలంగాణలో షర్మిల రాజకీయ అడుగులు..వాటి ప్రభావం పైన ఇప్పుడు రాష్ట్రంలో చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications