అవినీతి ఎమ్మెల్యేలున్నా చేతకాని దద్దమ్మలా.. కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు!!
తెలంగాణ సీఎం కెసిఆర్ ను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల టార్గెట్ చేశారు. పార్టీ ప్రతినిధుల సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ షర్మిల కెసిఆర్ కు తనదైన సూటి ప్రశ్నలు వేశారు.
తప్పు చేస్తే నా బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. ఇప్పుడు నీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని నువ్వే ఒప్పుకున్నావు కదా? మరి ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతిపరులని సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని షర్మిల పేర్కొన్నారు. దళితబంధులో రూ.3లక్షల లంచం తీసుకుంటున్నారని కెసిఆర్ చెప్పారని, వాళ్ల చిట్టా ఉందని చెప్తున్నా నువ్వు వాళ్ల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు.

అవినీతి ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదు? అని ప్రశ్నించారు. ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావే.. మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ దగ్గర చిట్టా ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు కేసీఆర్? అంటూ మండిపడ్డారు.
నువ్వు చర్యలు తీసుకుంటే లిక్కర్ స్కామ్ లోనీ బిడ్డ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే కదా.. అంటూ షర్మిల పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కళ్ళు తుడుచుకొని చేతకాని దద్దమ్మలా చూస్తున్నావని కేసీఆర్ ను తూర్పారబట్టారు. ఇదే సమయంలో సీఎం కెసిఆర్ కుమార్తె కవిత ను టార్గెట్ చేసిన వైయస్ షర్మిల అయినా నీ బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు.. ఇతరులను శిక్షించే అర్హత నీకెక్కడిది అంటూ చురకలంటించారు.
మీ ప్రభుత్వానికి పాలించే స్థాయి ఎక్కడిదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అవినీతి పాలనలో మునిగి తేలిన మీకు, మీ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. నీ అధికారాన్ని దూరం చేస్తారని వైయస్ షర్మిల తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications