బార్లు, బీర్ల తెలంగాణగా మార్చాడు: కేసీఆర్ మోసాలంటూ ఏకరువు పెట్టిన వైఎస్ షర్మిల
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా 47వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం తాళ్ల చెరువు వద్ద షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దపోచారం గ్రామానికి చేరుకుని గ్రామంలోని రైతు వేదిక వద్ద ధర్నా చేశారు.
రైతులు పండించిన వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత చిన్నపోచారం, నర్సింహులగూడెం, క్రిష్ణాపురం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. అనంతరం కూసుమంచి గ్రామంలో బహిరంగసభ నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇవీ కేసీఆర్ మోసాలు: వైఎస్ షర్మిల
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రెండుసార్లూ ప్రజలను మోసగించారన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారు. దళితబంధు ఇస్తానని మోసం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలనూ మోసం చేశారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగమని యువతను మోసం చేశారు. నెలకు రూ.3016 నిరుద్యోగు భృతి అని నిరుద్యోగులనూ మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కుర్చీ వేసుకుని పోడు భూములకు పట్టాలు ఇస్తానని మోసం చేశారని షర్మిల విమర్శలు గుప్పించారు.

సంతకం చేసి కేసీఆర్ రైతులను ముంచాడు: కేసీఆర్‌పై షర్మిల ఫైర్
వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఓసారి వరి సన్నొడ్లు వేయాలని చెప్పాడు. మరోసారి దొడ్డొడ్లు వేయాలని చెప్పాడు. ఇంకోసారి అసలు వరే వేయొద్దని, వరి ధాన్యం కొనబోమని చెబుతున్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆరే స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, సంతకం పెట్టారు. అసలు రైతుల తరఫున సంతకం చేసే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది? ఏ రైతును అడిగి సంతకం చేశారు? కేసీఆర్ సంతకం రైతుల పాలిట మరణ శాసనంగా మారింది.
ఇప్పటికే రైతులు అప్పులపాలై బాధపడుతుంటే కేసీఆర్ లేనిపోని సమస్యలు సృష్టించి, మళ్లీ రైతుల మీదే మోపుతున్నారు. ఓవైపు రుణమాఫీ లేదు. సబ్సిడీ విత్తనాలు లేవు. ఉచిత ఎరువులు లేవు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు. యంత్ర లక్ష్మి లేదు. మరోవైపు వరి వేయొద్దని, వడ్లు కొనబోమని రైతుల్ని నట్టేట ముంచుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా తగ్గడానికి కేసీఆరే కారణం. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎలా లేఖ రాశారు? 80వేల పుస్తకాలు చదివిన అపరమేధావికి బాయిల్డ్ రైస్ ఎప్పుడు వస్తుందో తెలియదా? తానే సంతకం పెట్టి రైతులను బావిలో తోసి, రైతులు మునిగిపోతుంటే, కేసీఆర్ రక్షించండి రక్షించండి అని నేడు ధర్నాలు చేయడం సిగ్గుచేటు. కేసీఆర్ రాసిన లేఖ వల్లనే కేంద్రం వడ్లు కొనబోమని చెబుతోంది. అందువల్ల కేసీఆరే రైతులు పండించిన వడ్లన్నీ బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలి. వరి వేసుకునే హక్కు రైతులకు ఉంది. దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కేసీఆర్ చేసిన తప్పుకు రైతులను శిక్షించడం న్యాయం కాదు. కేసీఆర్ బేషరతుగా ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. కేసీఆర్‌కు పంట నష్టపరిహారం ఇవ్వాలన్న సోయి లేదన్నారు.

కేసీఆరే వడ్లు కొనాలి.. 4 లక్షల కోట్ల అప్పులు: షర్మిల
ప్రగతి భవన్లో ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి, రైతుల్ని మోసగించారు. మిల్లర్లకు లాభాలు చేకూరాలనే ఉద్దేశంతోనే నేడు వడ్లు కొనబోమని చెబుతున్నారు. రైతులు పండించిన వడ్లను రా రైస్ చేసుకుంటారో, బాయిల్డ్ రైస్ చేసుకుంటారో, బంగారం చేసుకుంటారో కేసీఆర్ ఇష్టం. వడ్లను మాత్రం కొని తీరాల్సిందే. ఎకరాకు రూ.5వేల రైతు బంధు ఇచ్చి, రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టిండు. ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ లేదు.
ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మిల లేదు. ఇచ్చిన ఆ రూ.5వేలు బ్యాంకు రుణాలకు వడ్డీకి కూడా సరిపోవు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక డిగ్రీలు, పీజీలు చదివిన విద్యార్థులు హమాలీ పనులు చేసుకుంటున్నారు. ఆటోలు నడుపుకొంటున్నారు, ఆడపిల్లలు పొలం పనులకు, పత్తి ఏరడానికి పోతున్నారు. కేసీఆర్ నాలుగు లక్షల అప్పులు చేసినా.. ఫీజు రీయింబర్స్ మెంట్కు నిధులు ఉండవు. ఆరోగ్యశ్రీకి నిధులు ఉండవు. రుణమాఫీ ఉండదు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీలు చెల్లిద్దామన్నా నిధులు ఉండవు. బీడి బిచ్చం కల్లు ఉద్దర అన్నట్లు నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి, రూపాయి లేదంటున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు.
Recommended Video


బార్లు, బీర్ల తెలంగాణ, కేసీఆర్‌ను నమ్మి మోసపోవద్దు: షర్మిల
బంగారు తెలంగాణ పేరుతో బార్లు, బీర్ల తెలంగాణగా మార్చాడు. బంగారు తెలంగాణ పేరుతో అప్పులు, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు. ఉద్యమకారుడు కదా అని ముఖ్యమంత్రిని చేస్తే.. వేల మంది రైతులు, నిరుద్యోగుల మరణాలకు కారణమయ్యారు.బీజేపీ, టీఆర్ఎస్ రేట్లు పెంచి పేదల రక్తం తాగుతున్నయ్. పెట్రోల్, డీజిల్, నూనె రేట్లు కేంద్రం పెంచితే.. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మున్సిపల్ చార్జీలను రాష్ట్రం ప్రభుత్వం పెంచి, పేదల నడ్డి విరుస్తున్నయ్. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు. ఎన్నికల సమయంలో ఎన్నో దొంగ హామీలు ఇస్తాడు. ఎన్నో గారడి మాటలు చెబుతాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
కేసీఆర్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలి. కేసీఆర్ఎనిమిదేండ్లుగా నియంత, అక్రమ పాలన సాగిస్తున్నా.. ఏ ఒక్క పార్టీ ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. వారంతా కేసీఆర్ కు అమ్ముడుపోయారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. అందుకే మేం YSR తెలంగాణ పార్టీని స్థాపించాం. ప్రజల తరఫుర పోరాటం చేయడానికి, ప్రజా సమస్యలు ఎత్తిచూపడానికి, వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం. మాట తప్పని, మడమ తిప్పని వైయస్ఆర్ బిడ్డగా మాటిస్తున్నా.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ఆరోగ్యశ్రీని బ్రహ్మాండం చేస్తాం. మహిళలకు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికంగా బలోపేతం చేస్తాం.- పేద వాళ్లకు ఇండ్లు నిర్మించి, మహిళల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తాం.
ఉచిత విద్య, వైద్యంతో పాటు మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం. బీసీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తాం. రైతులతో పాటు కౌలు రైతులకూ న్యాయం చేస్తామన్నారు వైఎస్ షర్మిల.












Click it and Unblock the Notifications