కేసీఆర్ ను మళ్ళీ నమ్మితే తెలంగాణానే అమ్మేస్తాడు: విరుచుకుపడిన వైఎస్ షర్మిల!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. కెసిఆర్ కుటుంబ పాలనను, అవినీతిని ప్రజల ముందు ఏకరువు పెడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కెసిఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: వైఎస్ షర్మిల
కేసీఆర్ కు ఉద్యమకారుడని ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే, పాలన సాగించమని పెత్తనమిస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మాటమీద నిలబడే నాయకత్వం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడం లో సీఎం కేసీఆర్ దిట్ట అని పేర్కొన్న షర్మిల, ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ తన తండ్రిని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో దళిత బంధు, గిరిజన బంధు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని భవిష్యత్తులో బీసీ బంధు కూడా అంటారు అంటూ వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం తో కమీషన్లు దోచుకుని రాష్ట్ర ఖజానా కొల్లగొట్టారు
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ మరిచి విమానాలు కొంటున్నాడు.. పెద్దపెద్ద గడీలు కట్టుకుంటున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు రావడం, పథకాల ఆశ చూపడం, ఓట్లు దండుకోవడం..ఇదే నడిపిస్తున్నాడు అని వైయస్ షర్మిల కేసీఆర్ తీరును ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. కాళేశ్వరంతో కమీషన్లు దోచుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టాడని వైయస్ షర్మిల మండిపడ్డారు. కెసిఆర్ ను మళ్ళీ నమ్మితే తెలంగాణనే అమ్మేస్తాడు అంటూ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ నెరవేర్చని హామీల చిట్టా ఏకరువు పెట్టిన షర్మిల
రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేయలేదని, మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేదని, కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్యను అందిస్తామని, ఇంగ్లీష్ మీడియం చదువులు చెబుతామని చెప్పి మోసం చేశారని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని, నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదని ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేక పోయాడని వైయస్ షర్మిల మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఇవ్వలేదని, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని వైయస్ షర్మిల ప్రశ్నించారు.

అబద్దాలు చెప్పి మోసం చెయ్యటంలో కేసీఆర్ ను మించిన నాయకుడు లేడు
అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో కెసిఆర్ ని మించిన నాయకుడు లేరని వైయస్ షర్మిల మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోరే నిఖార్సయిన పార్టీ వైయస్సార్ తెలంగాణ పార్టీ అని పేర్కొన్న షర్మిల, నిరుద్యోగుల బాగు కోసం ఉద్యోగ నోటిఫికేషన్లపైనే మా తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు అందనంత దూరంలోకి వెళ్లిన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications