కేసీఆర్ కు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బుక్ పంపి.. వైఎస్ షర్మిల చురకలు
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుస్తకాన్ని కెసిఆర్ కు పంపిస్తున్నానని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నానని పేర్కొన్న షర్మిల కెసిఆర్ పై సెటైర్లు వేశారు.
80వేల పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ గారు, మేము పంపిన రాజ్యాంగ పుస్తకాన్ని తీరిగ్గా చదివి, రాష్ట్రంలో డా. బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నా. నియంత పాలన మానుకొని, ప్రజలకు సమాన హక్కులు.. ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కులు కల్పించాలని మనవి అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరికి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం వచ్చిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాజ్యాంగం నడుస్తోందని వైయస్ షర్మిల మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో రాజ్యాంగం మార్చాలని చెప్పారని, కెసిఆర్ రాజ్యాంగం ఎందుకు మార్చాలో చెప్పాలని షర్మిల నిలదీశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబంలోనే ఐదు ఉద్యోగాలు ఉన్నాయని విమర్శించిన షర్మిల, అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన దళితులపైన కేసీఆర్ కు ప్రేమ ఉన్నట్టు కాదన్నారు.
బీఆర్ఎస్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు లేదని మండిపడిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రం ఒక ఆఫ్గనిస్తాన్ అంటూ, సీఎం కేసీఆర్ ఒక తాలిబన్ అంటూ నిప్పులు చెరిగారు. కెసిఆర్ అంబేద్కర్ వారసుడని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అంతకు మించిన జోక్ మరొకటి లేదంటూ షర్మిల విమర్శించారు. దళితులను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని, దళితుల భూములు దోచుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అంబేద్కర్ వారసులమని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రికి సిగ్గుండాలి అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కెసిఆర్ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు లేవని, కెసిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడుగడుగున అవమానపరిచారని వైయస్ షర్మిల విమర్శించారు. కెసిఆర్ తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన షర్మిల, ప్రతిపక్షాలకు తమ గళం వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications