వైఎస్ షర్మిల పార్టీ నేడే ప్రారంభం: ఇడుపులపాయ-జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ హాజరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గురువారం(జులై 8)న తన కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో రాజన్న పాలన తీసుకొస్తామంటూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ(వైఎస్ఆర్టీపీ)గా తన పార్టీకి పేరు పెట్టారు.

ఇడుపులపాయ నుంచి బేగంపేటకు షర్మిల..
పార్టీ పేరు, జెండా, ఎజెండాను గురువారం సాయంత్రం వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించనున్నారు. అంతకుముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేస్తారు. వైఎస్‌కు నివాళులర్పించిన తర్వాత కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారు. తెలంగాణ సంప్రదాయ కళాకారులతో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.

షర్మిల కొత్త పార్టీకి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదిక
షర్మిల పార్టీ వర్గాలు తెలిపిన ప్రకారం.. పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. 5 గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన, లక్ష్యాలు, ఎజెండాపై గంటా 15 నిమిషాలపాటు ప్రసంగించనున్నారు.

షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్, పిల్లలు హాజరు
ఇప్పటి వరకు కోర్ టీంగా నిలిచిన కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి తదితరులు సభావేదికపై నుంచి జెండా ఆవిష్కరణలో పాలుపంచుకోనున్నారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా,
షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Recommended Video

తెలంగాణలో రాజన్న పాలనే లక్ష్యంగా షర్మిల పార్టీ...
తెలంగాణలో రాజన్న(వైఎస్ రాజశేఖర్ రెడ్డి) సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యమంటూ పార్టీ పెడుతున్నట్లు షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫిబ్రవరి 9న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పుడే జులై 8న పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. అంతేగాక, నిరుద్యోగ దీక్ష చేపట్టారు. అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్, బీజేపీలపైనా షర్మిల విమర్శలదాడికి దిగారు. తాజాగా, షర్మిల తన పార్టీ పేరు, విధివిధానాలు నేడు ప్రకటించనున్నారు. షర్మిల కొత్త పార్టీ నేడు ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఎలా మారనున్నాయో త్వరలోనే తేలనుంది.












Click it and Unblock the Notifications