తిరుమలలో భక్తులకు మరో సౌకర్యం: శ్రావణ మాసం వేళ..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం ఆరంభమైన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. 11 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది.
గురువారం 64,695 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,473 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 4.60 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ఈ నెలలో స్వామివారి విశేష ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.

కాగా- తిరుమలలో కొత్తగా మరో విశ్రాంతి భవనం అందుబాటులోకి రానుంది. సుమారు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇది నిర్మితమౌతోంది. ఏడాది కాలంలో ఈ విశ్రాంతి వసతి భవన సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావాలని టీటీడీ అధికారులు సంకల్పించారు.

శ్రావణ మాసం తొలి రోజున.. ఈ విశ్రాంతి భవన సముదాయం నిర్మాణానికి భూమిపూజ చేశారు టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ సెల్‌కాన్ ఛైర్మన్ వై గురుతో కలిసి శంకుస్థాపన చేశారు. టీటీడీ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య, శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ సెల్‌కాన్ ఈ విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్నీ ఆ సంస్థ యాజమాన్యం భరిస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులకు విశ్రాంతిని కల్పించడానికి అవసరమైన అన్ని వసతులను కల్పించేలా ఈ భవనం నిర్మితం కానుంది.












Click it and Unblock the Notifications