మందు పాతరలకే భయపడలేదు, గులకరాళ్ళకు జంకుతానా ? వైసీపీని ప్రశ్నించిన చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలలో పాల్గొన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చంద్రబాబు నేడు ఉగాది పండుగ వేడుకల్లో పాల్గొన్న అనంతరం వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కొత్త సంవత్సరంలో సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
తిరుపతిలో ఉగాది వేడుకల్లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు . తిరుపతి వేదికగా టీడీపీ నాయకులంతా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఈసారి ఉగాది తిరుపతిలో జరుపుకున్నారు. ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం తర్వాత మాట్లాడిన చంద్రబాబు ఏదీ శాశ్వతం కాదు అనేది తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలతో నిరూపితమవుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలపై పోరాడి, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

చేయడానికి ఏమీ లేకనే వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు
తిరుపతి అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్న చంద్రబాబు, చేయడానికి ఏమీ లేకనే వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు . 1983 నుండి తిరుపతిలో ఎక్కువ సార్లు టిడిపి విజయం సాధించిందని పేర్కొన్న చంద్రబాబు, తిరుపతి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అభిప్రాయం వ్యక్తం చేశారు . అటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో ప్రజలు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు తిరుపతిలో అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు.

నా సభపై రాళ్లు వేస్తారా ? మందు పాతరలకే భయపడ లేదన్న చంద్రబాబు
నా సభపై రాళ్లు వేస్తారా ? మందు పాతరలకే భయపడ లేదు... గులకరాళ్ళకు భయపడతానా అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. తిరుపతిలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగితే, తిరుమలపైన కూడా దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్న చంద్రబాబు తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిన్న చంద్రబాబుపై ఎన్నికల ప్రచార సమయంలో రాళ్ళ దాడి జరిగింది. వైసీపీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే కొందరు దుండగులు చంద్రబాబుపై రాళ్ళ దాడికి తెగబడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది . ఇక ఈ ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండిస్తున్నారు. అసలు చంద్రబాబుపై రాళ్ళ దాడి జరగనే లేదని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications