తిరుమలలో గోల్డెన్ బాయ్స్- ఒంటిపై 25 కేజీల నగలు
Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. మంగళవారం నాడు 63,202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,057 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.37 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగళా సర్కిల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

నేడు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల్లో మహారాష్ట్రలోని పుణే నుంచి వచ్చిన వాళ్లు అందరి దృష్టినీ ఆకర్షించారు. మిగిలిన వాళ్ల కళ్లన్నీ వాళ్ల మీదే నిలిచాయి. చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. వారితో సెల్ఫీలు తీసుకోవడానికి, ఫొటోలు దిగడానికీ భక్తులు పోటీ పడ్డారంటే వాళ్లు ఏ స్థాయిలో కట్టిపడేశారో అర్థం చేసుకోవచ్చు.
ఆ భక్తులు- నానా సాహెబ్ వాగ్చొరె, సంజయ్ గుజర్. మహారాష్ట్రలో సొంత పేర్లతో పిలిస్తే ఎవరూ గుర్తుపట్టలేరు. గోల్డెన్ బాయ్స్గా పిలుస్తారు వాళ్లను. వాళ్ల ఒంటి నిండా బంగారు నగలే. మెడలో ఇంతేసి లావుపాటి బంగారు చైన్లను ధరించారు. మోచేతుల వరకూ బంగారు పట్టీలను వేసుకున్నారు.
వాళ్లతో పాటు వచ్చిన మహిళ బంగారుతో చేసిన చీరెను ధరించి కనిపించారు. ఇదివరకు హిందీ బిగ్ బాస్ హౌస్‌లోనూ మెరుపులు మెరిపించారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలేశుడి సేవలో పాల్గొన్నారు. చాలాకాలంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకుంటోన్నామని, ఆ కోరిక నేటితో తీరిందని అన్నారు.












Click it and Unblock the Notifications