స్వామివారి ఆలయాన్ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసా ?
స్వామివారి మూలవిరాట్టును పూర్తిగా నూతన వస్త్రంతో కప్పిన తర్వాతే దేవాలయాన్ని శుద్ధి చేస్తారు.
తిరుమల కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6.00 గంటల నుంచి 11.00 గంటల వరకూ ఈ శుద్ది కార్యక్రమం జరిగింది. సంవత్సరానికి నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి.. ఈ నాలుగు సందర్భాల్లోనే తిరుమంజనం ఉంటుంది. వీటికి ముందుగా వచ్చే మంగళవారం రోజు ఆలయాన్ని శుభ్రం చేస్తారు.
ముందుగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు. తర్వాత ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపాలయాలు, పూజాసామాగ్రి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.. శుద్ధి పూర్తయిన అనంతరం పచ్చకర్పూరం, గంధంపొడి, నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేస్తారు.

స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించిన తర్వాత ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 11.00 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఆలయ గోడలకు,పై కప్పులకు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పరిమళాన్ని గోడలకు అంటించి పరిశుభ్రం చేస్తారు. గర్భాలయాన్ని శుద్ధి చేసే సమయంలో స్వామివారిని పూర్తిగా నూతన వస్త్రంతో కప్పుతారు. తరతరాలుగా పూర్వీకుల నుంచి వస్తోన్న వివిధ రకాల ఆయుర్వేదం మూలికల మిశ్రమంతో పరిమళాన్ని తయారు చేస్తారు. ఈ పరిమళాన్ని ఆలయ గోడలకు అంటిస్తే క్రిమి కీటకాల నుంచి రక్షణ ఉంటుందనే నమ్మకం ఉంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా రెండురోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తారు.












Click it and Unblock the Notifications